
ఐదు పీహెచ్‌సీలకు నిధులు
సంగారెడ్డి : జిల్లాలో నూతనంగా ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా జిల్లాలోని అందోల్ మండలం నేరడిగుంట, రాయికోడు మండలం సంగీతం, ఝరాసంగం మండలం బర్దీపూర్, మునిపల్లి మండలం కంకోల్ గ్రామాల్లో రూ.2.45కోట్ల నిధులు మంజూరయ్యాయి. అలాగే నూతనంగా ఏర్పడ్డ చౌటకూరు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో రూ.2.60కోట్ల నిధులు మంజూరు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఐదింటిలో బర్దీపూర్, కంకోల్, సింగీతంలలో టెండర్లు పూర్తయి పనులు కొనసాగుతున్నాయి. నేరేడుగుంటలో టెండర్ దశ పూర్తయింది. నూతనంగా ఏర్పడ్డ చౌటకూర్ మండలం సుల్తాన్పూర్‌లో ఈ రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలువనున్నారు. జిల్లాలో నూతనంగా ఐదు ఆస్పత్రులు మంజూరు కావడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఉండటం ఆయన చొరవతోనే ఈ ఐదు ఆస్పత్రులు వచ్చాయని చెబుతున్నారు. ఇదేవిధంగా జిల్లాకు మరిన్ని పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి రాష్ట్రంలోనే జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కషి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహను జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం జిల్లాకు జేఎన్టీయూ తేవడం ఆయన కృషే అంటున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాతో పాటు అందోల్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని నియోజకవర్గ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రెండు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పనులు ప్రారంభం
మరో రెండింటికి టెండర్లు ఖరారు
మంత్రి దామోదర చొరవతోనే..
త్వరగా పూర్తయ్యేలా చర్యలు
జిల్లాలో మంజూరైన ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఐదు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయితే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది.
– గాయత్రీదేవి. జిల్లా వైద్యాధికారి