
సొంత విత్తనంతోనే మనుగడ
● ప్రపంచ విత్తన వారోత్సవంలో విత్తన శాస్త్రవేత్త గౌరీ శంకర్ ● ప్రదర్శనకు అరుదైన విత్తన రకాలు ● జన్యుమార్పిడి హైబ్రీడ్ రకాలతో ముప్పు ● అధికంగా విత్తనాలు ప్రదర్శించిన మహిళా రైతులకు ప్రోత్సాహకాలు
ఆకట్టుకున్న అరుదైన విత్తన ప్రదర్శన
అంతర్జాతీయ విత్తన వారోత్సవాలను పురస్కరించుకుని మహిళా రైతులు ప్రదర్శించిన అరుదైన చిరుధాన్యాల రకాలు ఆకట్టుకున్నాయి. జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్‌కల్, మొగుడంపల్లి మండలాలకు చెందిన రైతులు ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న రైతులకు సంబంధించి న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. ఝరా సంగం మండలంలోని బిడకన్నె గ్రామానికి చెందిన జడల చంద్రమ్మ 58 విత్తన రకాలు ప్రదర్శించి మొదటి బహుమతి అందుకుంది. న్యాల్‌కల్ మండలంలోని గుంజోటి గ్రామానికి చెందిన కర్నె నర్సమ్మ 56 విత్తన రకాలను ప్రదర్శించి రెండో బహుమతి, ఝరాసంగం మండలంలోని పొట్‌పల్లి గ్రామానికి చెందిన మొగులమ్మ 55 విత్తన రకాలను ప్రదర్శించి మూడో బహుమతిని అందుకున్నారు.
జహీరాబాద్: నేడు ప్రపంచం అంతా వ్యవసాయం, ఆహార వ్యవస్థలలో పోగొట్టుకున్న విత్తనాలు, పద్ధతులను మళ్లీ వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని విత్తన శాస్త్రవేత్త గౌరీ శంకర్ పేర్కొన్నారు. సొంత విత్తనాలతోనే వ్యవసాయ మనుగడ ఆధారపడి ఉందన్నారు. మనం సొంత విత్తనాలు దాచుకోవడం, వాటి విశిష్టతను ప్రపంచం మొత్తం గుర్తిస్తోందని తెలిపారు. జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్‌లోని డీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రపంచ విత్తన వారోత్స కార్యక్రమంలో ఆయనతో పాటు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్య పాల్గొని మాట్లాడారు. ఎన్నో దశాబ్దాలుగా ఈ పద్ధతులు కాపాడుకుంటూ వస్తోన్న డీడీఎస్ మహిళల నుంచి స్ఫూర్తిని అందుకుని అందరూ ఈ వీరి బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దివ్య మాట్లాడుతూ...చాలా దేశాల్లో విత్తనాలు దాచుకునే హక్కులు లేవన్నారు. జన్యుమార్పిడి విత్తనాలతో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రదర్శనకు అరుదైన రకాలు
దేశీయ విత్తనాలలో అరుదైన రకాలైన అత్తా కోడళ్ల జొన్నలు, నల్ల తొగరి, బుర్క తొగరి, తెల్ల శనగలు, నల్ల బెబ్బర్ల వంటి అంతరించిపోతున్న అరుదైన విత్తనాలను ప్రదర్శించారు. వీటితోపాటు కొర్ర, సజ్జ, సామ, మినుము, పెసర, సామ, ఉలవ, గడ్డి నువ్వు, తైద, పచ్చజొన్న, ఎర్రజొన్న తదితర రకాలు ప్రదర్శలో ఉంచారు.
58 రకాల ప్రదర్శించా
తనవద్ద నిల్వచేసి పెట్టుకున్న 58 రకాల విత్తనాలను ప్రదర్శనకు పెట్టాను. అందులో అరుదైన రకాల విత్తనాలు కూడా ఉన్నాయి. ప్రతి ఏటా విత్తనాలు వేసుకుని పంట వచ్చాక వాటిలో నాణ్యమైనవి ఎంపిక చేసి విత్తనంగా నిల్వ చేస్తాను.
–చంద్రమ్మ, రైతు,బిడకన్నె
రెండెకరాల్లో అనేక రకాలు
రెండెకరాల్లో 55కు పైగా రకాల చిరుధాన్యాలను పండిస్తున్నా. వాటినే విత్తనాలుగా ఉపయోగించుకుంటున్నాను. రైతులు తన దగ్గరకు వచ్చి విత్తనాలు తీసుకెళ్తారు. వానాకాలం, యాసంగి విత్తనాలు నిల్వపెట్టుకుంటాను.
–మొగులమ్మ, రైతు, పొట్‌పల్లి
సొంత పొలంలో సాగు చేస్తున్నా
తనకు ఉన్న సొంత పొలంలో చిరు ధాన్యాలు, పప్పు దినుసులు, కూర గాయలు సాగు చేస్తున్నా. 60 రకాల వరకు విత్తనాలు, 15 రకాల వరకు దేశీ కూరగాయలు పండిస్తున్నా. న్యాల్‌కల్, హద్నూర్ తదితర అంగళ్లకు వెళ్లి కూరగాయలు అమ్ముకుంటున్నా. విత్తనాలు నిల్వపెట్టి సాగు చేస్తున్నా. మిగతావి తోటి రైతులకు ఇస్తున్నా.
–నర్సమ్మ, రైతు–గుంజోటి

సొంత విత్తనంతోనే మనుగడ

సొంత విత్తనంతోనే మనుగడ

సొంత విత్తనంతోనే మనుగడ

సొంత విత్తనంతోనే మనుగడ