
చికిత్స పొందుతూ బాలుడు మృతి
● వైద్యం వికటించడం వల్లేచనిపోయాడని కుటుంబీకుల ఆరోపణ ● మా తప్పేమీ లేదన్న వైద్యులు
సిద్దిపేటజోన్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు సోమవారం మృతి చెందాడు. వైద్యం వికటించడం వల్లే బాలుడు చనిపోయాడని బాలుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక పట్టణానికి చెందిన అనిల్, భవానీ దంపతుల 8 నెలల బాలుడు(నిహాన్)ను ఆదివారం సాయంత్రం పట్టణంలోని సంరక్ష పిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో తెమడ(బ్రాంకిటిస్ న్యూమేనియా)గా గుర్తించి ఐసీయూలో చేర్పించి చికిత్స ప్రారంభించారు. సోమవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యం వికటించడం వల్లే బాబు చనిపోయాడని ఆరోపిస్తూ ఆస్పత్రి వైద్యులను నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. సోమవారం తెల్లవారు జామున నర్స్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతే పల్స్ రేటు పడిపోయి బాబు చనిపోయాడని తల్లి భవానీ విలపిస్తూ పేర్కొంది. బ్రాంకిటిస్ న్యూమేనియాతో బాధపడుతున్న బాబుకు చికిత్స అందిస్తుండగా సోమవారం పరిస్థితి విషమంగా మారింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండగా సీపీఆర్ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదని, ఇందులో మా తప్పు ఏమీ లేదని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.