
భూములు లాక్కుంటే మేమెట్లా బతకాలి..?
మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
● గుమ్మడిదలలో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం ● భూసేకరణ వేగవంతం చేసిన అధికారులు ● భూమికి భూమి ఇవ్వాలి.. లేదా ప్రత్యామ్నాయం చూపాలి ● బాధిత రైతుల డిమాండ్
మినీ ట్రాక్టర్‌తో మందులను పిచికారి చేసే విధానంపై నిర్వహించిన ప్రదర్శన
వ్యవసాయ భూములు లాక్కోవద్దు
ఎన్నో ఏళ్లుగా మేమంతా భూములు సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం పార్కు పేరిట మా భూములు కావాలంటుంది. ముందుగా మాకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలి. వేరేచోట భూములు ఇచ్చినా సరే.. లేదంటే రోడ్డున పడతాం. భద్రయ్య, రైతు, గుమ్మడిదల
భూమికి భూమి ఇవ్వాలి
ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం రైతులకు భూమికి భూమి ఇచ్చి న్యాయం చేయాలి. ఎన్నో ఏళ్లుగా ఈ భూముల్లో ఉపాధి పొందుతున్నాం. ఇప్పుడు పారిశ్రామిక వాడ ఏర్పాటు పేరిట రైతుల భూములు సేకరిస్తున్న ప్రభుత్వం.. బాధిత రైతులకు న్యాయం చేయాలి.
రవీందర్, రైతు, గుమ్మడిదల
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో కాలుష్యరహిత ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు నిర్ణయం రైతులకు కునుకు లేకుండా చేస్తోంది. గుమ్మడిదలలో సర్వే నంబర్ 109లో 157.29 ఎకరాలలో ఈ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ విషయమై అధికారులు దూకుడు పెంచారు. ఇటీవల గ్రామ సభను ఏర్పాటు చేశారు. టీఎస్‌ఐఐసీ జోనల్ మేనేజర్ రతన్ రాథోడ్, ఆర్డీవో రవీందర్ రెడ్డి భూసేకరణపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. అయితే.. భూములు తీసుకుంటున్న అధికారులు.. భూమికి బదులు భూమి ఇస్తారా..? లేక ఇంకేమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపుతారా? అనేది ప్రకటించలేదు. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘‘మా తాతల కాలం నుంచి భూములను నమ్ముకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీయల్ పార్కు పేరిట మా భూములను లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. భూములు లాక్కుంటే మేం ఎట్లా బతకాలి. భూమికి భూమి ఇవ్వాలి. లేదా అన్నారం పరిధిలోని సర్వే నంబర్ 261లో వెయ్యి గజాలు చొప్పున పట్టాలు చేసి ఇవ్వాలి’’అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నేళ్లుగా బతుకుదెరువునిచ్చిన భూములను అప్పగించేందుకు మాత్రం వారు వెనుకడుగు వేస్తున్నారు.
బాధిత రైతులకు న్యాయం చేస్తాం
గుమ్మడిదల మున్సిపాలిటీలో గ్రీన్, ఆరెంజ్ జోన్లో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆర్డీవో రవీందర్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో పార్కు ఏర్పడితే కాలుష్య రహిత పరిశ్రమలను స్థాపిస్తామని, తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధికి కేంద్రబిందువుగా ఉంటుందన్నారు. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. – ఆర్డీఓ రవీందర్ రెడ్డి
న్యూస్‌రీల్

భూములు లాక్కుంటే మేమెట్లా బతకాలి..?

భూములు లాక్కుంటే మేమెట్లా బతకాలి..?

భూములు లాక్కుంటే మేమెట్లా బతకాలి..?