చిరు ధాన్యాల భాండాగారం | - | Sakshi
Sakshi News home page

చిరు ధాన్యాల భాండాగారం

Apr 29 2025 9:45 AM | Updated on Apr 29 2025 10:09 AM

చిరు

చిరు ధాన్యాల భాండాగారం

● 40 గ్రామాల మహిళా రైతుల విత్తనాల ప్రదర్శన ● డీడీఎస్‌ సంఘాల సభ్యులు చిరుధాన్యాలే సాగు
నేటి నుంచి విత్తన వారోత్సవాలు

జహీరాబాద్‌: మహిళా రైతులు తమ పొలాల్లో నాటుకునేందుకు సొంత విత్తనాలే వాడుతారు. పంట చేతికి రాగానే అందులోని నాణ్యమైన పంటను విత్తనంగా సేకరించి నిల్వ పెట్టుకున్నారు. విత్తనాలు వేసే సమయానికి వాటిని బయటకు తీస్తారు. జహీరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని జహీరాబాద్‌, కోహీర్‌, ఝరాసంగం, న్యాల్‌కల్‌, మొగుడంపల్లి, రాయికోడ్‌ మండలాల్లోని సుమారు 70 గ్రామాల్లో డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌) సంఘంలోని మహిళా రైతులు తమకు అవసరమైన మేరకు ప్రతి ఏటా చిరుధాన్యాల విత్తనాలు నిల్వ పెట్టుకుంటారు. ఎంపిక చేసుకున్న విత్తనాలకు పురుగు పట్టకుండా ఉండేందుకు గాను బూడిద, వేపాకు కలిపి ఈత బుట్టల్లో పోసి మట్టితో మూసి వేస్తారు. విత్తనాలు పెట్టే సమయంలో వాటిని బయటకు తీసి ఉపయోగిస్తారు. సుమారు 50 నుంచి 70 రకాల వరకు విత్తనాలను నిల్వచేసి పెట్టుకుంటారు. సాయిజొన్న, పచ్చజొన్న, తీపి జొన్న, గుండు జొన్న, తోక జొన్న, సజ్జ, కొర్ర, తైద, సామ, శనగ, ఆర్గులు, పెసర, మినుము, అవిశ, కందులు, కోడి సామ, ఎవ్వలు ఇలా అనేక రకాల విత్తనాలను సేకరించి పెట్టుకుంటారు. ఆయా పంటలన్నీ వర్షాకాలంలో వర్షాధారంగా, యాసంగిలో తేమ ఆధారంగా పండే పంటలను సాగు చేసుకుంటారు.

నేడు ప్రపంచ విత్తన వారోత్సవం

29న (మంగళవారం) డీడీఎస్‌ ఆధ్వర్యంలో ప్రపంచ విత్తన వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ చివరి వారాన్ని ప్రపంచ వ్యాప్తంగా విత్తన వారోత్సవంగా జరుపుకొంటారు. అందులో భాగంగా జహీరాబాద్‌ మండలంలోని పస్తాపూర్‌ గ్రామంలోని డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌) ఆధ్వర్యంలో ఉ. 11.30 గంటలకు మహిళా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 40 గ్రామాల నుంచి మహిళా రైతులు తమ వద్ద ఉన్న పలు రకాల చిరుధాన్యాల విత్తనాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఎంపికయిన ఉత్తమ రైతులకు బహుమతులను అందజేస్తారు.

మాచ్‌నూర్‌లో విత్తన బ్యాంకు

ఝరాసంగం మండలంలోని మాచ్‌నూర్‌ గ్రామంలో డీడీఎస్‌ ఆధ్వర్యంలో చిరు ధాన్యాల విత్తన బ్యాంకును నిర్వహిస్తున్నారు. ఈ విత్తన బ్యాంకులో 60 రకాల వరకు విత్తనాలు రైతులకు అన్ని రకాలు కలిపి సుమారు 20 క్వింటాళ్ల మేర అందుబాటులో ఉంచుతారు. అవసరం అయిన రైతులు విత్తన బ్యాంకును సంప్రదించి విత్తనాలు పొందుతారు. పంట చేతికి రాగానే విత్తన బ్యాంకులో రైతులు తీసుకున్న విత్తనాన్ని తిరిగి అందజేస్తారు. 10 కిలోల విత్తనం పొందితే తిరిగి ఇచ్చే సమయంలో 15 కిలోలు అప్పజెపుతారు.

చిరు ధాన్యాల భాండాగారం1
1/1

చిరు ధాన్యాల భాండాగారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement