
మార్కెట్ ధర చెల్లించాలి
జిన్నారం (పటాన్‌చెరు): మార్కెట్ ధర ప్రకారమే రైతులకు న్యాయం చేయాలని, వారికి ఎదురయ్యే సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిన్నారం రైతులు విజ్ఞప్తి చేశారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 109లో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం శుక్రవారం నిర్వహించిన గ్రామసభకు వారు హాజరై వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ....పారిశ్రామిక వాడ ఏర్పాటు నేపథ్యంలో మార్చి 7న భూసేకరణ ప్రారంభించామన్నారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు రైతుల నుంచి అభిప్రాయాలు అడిగితెలుసుకున్నారు. పారిశ్రామికవాడ ఏర్పాటయితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. పరిశ్రమలు ఏర్పడితే ఈ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధిలోకి వస్తుందన్నారు. అనంతరం రైతు నాయకులు మాట్లాడుతూ...ఇప్పటికే 98 మంది రైతులు ఉన్నారని, రైతులందరూ వారి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలన్నారు. వీటిలో ఏవైనా తప్పులు ఉన్నా, ఎవరి పేరైనా రాకపోయినా, వాటిలో భూమి వివరాలు పడకపోయినా, ఒకవేళ రైతు చనిపోయిన, లేదా భార్య లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న రికార్డుల్లో మార్పులు చేర్పులు సరి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పరమేశం, ఆర్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది, స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణలో జిన్నారం రైతులు