
అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో వివాదం
కొమురవెల్లి(సిద్దిపేట): అంబేడ్కర్ జయంతి రోజు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళ్తే.. కొమురవెల్లి మండల కేంద్రంలో గోషాల సమీపంలో వైజంక్షన్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, మాల సామాజిక వర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సిద్దప్ప, మాజీ ఎంపీపీ తలారి కీర్తన కిషన్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. గ్రామంలో 40 ఏళ్ల కిందటే అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, కొంత మంది వ్యక్తులు తమకు చెప్పకుండా ప్రభుత్వ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని దళిత సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎంపీడీవో శ్రీనివాస వర్మ, పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్‌కు ఫిర్యా దు చేశారు. వెంటనే ఆవిష్కరణ నిలిపివేయాలన్నారు. వారి మాట వినకుండా సిద్దప్ప, కీర్తన కిషన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొంత మంది కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో సీఐ శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు మోహరించడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంపై కొందరి పేర్లు మాత్రమే ఉన్నాయని, శిలాఫలకం తొలగించాలని కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇరువర్గాలతో మాట్లాడి శిలాఫలకానికి రంగు వేయడంతో సమస్య సద్దు మనిగింది. అనంతరం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులు అంబేడ్కర్‌కు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
శిలాఫలకంపై పేర్లు ఉన్నాయని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల వాగ్వాదం
చివరకు శిలాఫలకంపై రంగు

అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో వివాదం