
మల్లన్నకు కాసుల గలగల
● వార్షిక నికర ఆదాయం రూ.20 కోట్లు ● ఏటా కోటిమందికి పైగా భక్తుల దర్శనం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొనే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఆలయ అధికారులు, పాలకమండలి, అర్చకులు, ఒగ్గుపూజారులు, సిబ్బంది సైతం భక్తులకు వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. భక్తుల ఆదరణతో రోజురోజుకు కోరమీసాల స్వామికి కాసుల వర్షం కురుస్తోంది. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జితసేవలు, హుండీ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. దీంతో భక్తులకు మరిన్ని వసతులు కల్పిస్తున్నారు. గతంలో భక్తులు బ్రహ్మోత్సవాల సమయంలోనే ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకునేవారు. ప్రస్తుతం సంవత్సరం పాటు ప్రతి ఆది, బుధ వారాల్లో వచ్చి పూజలు చేస్తున్నారు. భక్తులు సంవత్సరం పొడవున స్వామి వారి దర్శనానికి వస్తుండటంతో ఆదాయం భారీగా పెరిగింది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారంతో మొదలై ఉగాది పర్వదినానికి వచ్చే ఆదివారంతో ముగుస్తాయి. మూడు నెలల పాటు కొనసాగే స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఏటా కోటి మందికి పైగా భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకోవడంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతోంది.
పెరుగుతున్న ఆదాయం
ఆలయానికి వచ్చే వార్షిక నికర ఆదాయంలో జాతర బ్రహ్మోత్సవాల్లోనే సగం వరకు సమకూరుతోంది. 2023 బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవల ద్వారా రూ. 4.90 కోట్లు, హుండీ ద్వారా 4.32 కోట్లు, 2024 బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవల ద్వారా రూ 6.22 కోట్లు హుండీ ద్వారా రూ.4.22 కోట్ల ఆదాయం సమకూరింది. 2025 బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి భక్తులు ఆర్జిత సేవలు, పట్నం, బోనాలు, అభిషేకం, ప్రసాద విక్రయం, కేశఖండన, వసతి గదుల అద్దె మొదలగు సేవల ద్వారా రూ. 5.64 కోట్లు, హుండీ ద్వారా 3.92 కోట్లు సమాకూరాయి. గత రెండు బ్రహ్మోత్సవాలకంటే ఈ సంవత్సరం కొంత ఆదా యం తగ్గినా వార్షిక నికర ఆదాయం పెరిగింది.

మల్లన్నకు కాసుల గలగల