
వట్‌పల్లి(అందోల్): చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జోగిపేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ అరుణ్ కుమార్ గౌడ్ తెలిపిన ప్రకారం.. పుల్కల్ మండలం సింగూరు గ్రామానికి చెందిన ఆత్మకూరు బీరయ్య (31) ఈనెల 15వ తేదీన రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఫోన్ చేసినా అతడి నుంచి సమాధానం రాలేదు. తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం మధ్యాహ్నం అందోలు మండలం అన్నసాగర్ చెరువులో మృతదేహం తేలుతూ కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు బీరయ్యగా గుర్తించారు. వ్యక్తిగత కారణాలతో చెరువుల దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
వివాహిత..
జిన్నారం(పటాన్‌చెరు): వివాహిత ఆత్యహత్య చేసుకున్న ఘటన జిన్నారం మండలంలోని బొల్లారం పీఎస్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ కథనం మేరకు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఉపేందర్, మనీషా(30) ఇద్దరు పిల్లలతో రెండేళ్ల నుంచి బొల్లారంలోని లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఉపేందర్ ఆటో నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. మూడు నెలల నుంచి ఆర్థిక పరమైన విషయాల్లో భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం మరోసారి గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన మనీషా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ తెలిపారు.
బీరయ్య మృతదేహం