
బుధవారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2023
● చివరిరోజు భారీ ర్యాలీలు, పాదయాత్రలు ● అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ బహిరంగ సభలు ● జిల్లాకు వరుస కట్టిన కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు ● పక్షం రోజులుగా పెద్దఎత్తున సాగిన ప్రచారం ● ముగిసిన ప్రచార పర్వం
రేపే ఓట్ల జాతర!
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. పక్షం రోజుల పాటు అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకున్న అభ్యర్థులు మరోవైపు ర్యాలీలు, రోడ్‌షోలతో హంగామా చేశారు. రెండు నెలల ముందే అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో బీఆర్‌ఎస్ ప్రచారం జోరుగా సాగింది. ప్రణాళికాబద్ధంగా ఈ పార్టీ అభ్యర్థులు నియోజకవర్గాలు రెండు, మూడు పర్యాయాలు చుట్టేశారు. పలు నియోజకవర్గాల్లో నామినేషన్ల చివరి వరకు అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి కొన్ని రోజులే సమయం దొరికింది. ఆ కొద్ది రోజుల్లోనే ఆ పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించారు.
అన్ని చోట్ల సీఎం కేసీఆర్ బహిరంగ సభలు
జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ బహిరంగసభలు జరిగాయి. సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌లో జరిగిన బహిరంగసభల్లో ప్రసంగించారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ సమస్య తలెత్తుతుందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరోవైపు మంత్రి హరీశ్‌రావు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పలుమార్లు ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలు, ఆత్మీయ సమ్మేళనాలు, సభలు, సమావేశాలతో రెండు నెలలుగా క్షణం తీరిక లేకుండా గడిపారు. కేటీఆర్ రోడ్‌షోలు కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జరిగాయి.
బీజేపీ అగ్రనేతలు వచ్చినా..
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు కూడా జిల్లాకు వచ్చారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంగారెడ్డిలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. జహీరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పాల్గొన్నారు. పటాన్‌చెరు బహిరంగసభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యారు. అగ్రనేతలు జిల్లాకు వచ్చినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులు మాత్రం మొక్కుబడిగా ప్రచారం చేశారు.
స్వతంత్రులు సైతం..
స్వతంత్రులు, ప్రధానేతర పార్టీల అభ్యర్థులు సైతం ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అభ్యర్థులు కూడా జోరుగానే ప్రచారం నిర్వహించారు. మరోవైపు సాధారణ రీతిలో ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు మరోవైపు సోషల్‌మీడియాపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో వినూత్న రీతిలో వారి ప్రచారం కొనసాగింది.
● పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
● స్వేచ్ఛగా ఓటు వేయండి: కలెక్టర్ శరత్
● కేంద్రాల వద్ద బందోబస్తు: ఎస్పీ రూపేష్
న్యూస్‌రీల్
చివరి రోజు భారీ ర్యాలీలు
ప్రచారంలో చివరి రోజు మంగళవారం అన్ని పార్టీ అభ్యర్థులు భారీ ర్యాలీలతో హోరెత్తించారు. బైక్‌ర్యాలీలతో పాటు, పాదయాత్రలు నిర్వహించారు. సంగారెడ్డి, జోగిపేట, పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల కేంద్రాలతో పాటు, పలు పట్టణాలు, మండల కేంద్రాల్లోనూ ప్రధాన పార్టీల ర్యాలీలు జరిగాయి. మొత్తం మీద పక్షం రోజుల పాటు ఎన్నికల ప్రచార పర్వం తారాస్థాయిలో జరిగింది.
బీఆర్‌ఎస్‌కు దీటుగా కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించింది. అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. అధికార బీఆర్‌ఎస్‌కు దీటుగా బహిరంగ సభలను నిర్వహించింది. ఆ పార్టీ జాతీయ నాయకులు సైతం జిల్లాకు వరుస కట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సంగారెడ్డిలో జరిగిన బహిరంగసభలకు హాజరయ్యారు. చివరి రోజు ప్రియంకాగాంధీ రోడ్‌షో జహీరాబాద్‌లో జరిగింది. నారాయణఖేడ్, పటాన్‌చెరుల్లోని బహిరంగసభలకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.

మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హనుమంతరావు

నల్లవల్లిలో రికార్డులను పరిశీలిస్తున్న జయశ్రీరాజ్