
సభా స్థలిని పరిశీలిస్తున్న దేవిప్రసాద్, శివకుమార్ తదితరులు
పటాన్‌చెరు టౌన్: అసెంబ్లీ స్థానానికి 25 మంది నామినేషన్లు దాఖలు కాగా మంగళవారం అందులో ముగ్గురు ఉపసంహరించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి నల్లగండ్ల లింగారెడ్డి, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ అభ్యర్థి కొత్త బలిజ బసవరాజ్, భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ గౌడ్ ఉపసంహరించుకున్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దేవుజా తెలిపారు. సోమవారం స్క్రూటినీ నిర్వహించగా 25 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించడంతెలిసిందే.
రేపు హద్నూర్‌కు
మంత్రి హరీశ్‌రావు రాక
న్యాల్‌కల్(జహీరాబాద్): ఈనెల 16న ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు మండలపరిధిలోని హద్నూర్‌కు రానున్నారు. పాత పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. మంగళవారం ఎన్నికల ఇన్‌చార్జి, బెవరైజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఈదుపల్లి శివకుమార్ తదితరులు సభా స్థలిని పరిశీలించారు. మొదటిసారి మండలానికి వస్తున్నందునా కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని బీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. గత నెల 30న న్యాల్‌కల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరుకావాల్సి ఉండగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి ఘటన నేపథ్యంలో రాలేకపోయారు.
పెళ్లి విషయమై మనస్తాపంతో యువతి ఆత్మహత్య
పటాన్‌చెరు టౌన్: పెళ్లి విషయంలో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అమీన్‌పూర్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన మీనాక్షి కుంజల్(22) అమీన్‌పూర్ మండలం బీరంగూడలో ఉన్న బంధువుల వద్ద ఉంటోంది. కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటోంది. ఈ క్రమంలో యువకుడితో పరిచయమై అదికాస్త ప్రేమగా మారింది. రెండు నెలల క్రితం అతడిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. తల్లిదండ్రుల నుంచి సోకిన హెచ్‌ఐవీ ఉండటంతో వద్దని నచ్చజెప్పారు. దీంతో మనస్తాపం చెందిన తాను ఈనెల 13వ తేదీ రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే కుంజల్ మృతిచెందినట్లు నిర్ధారించారు. సోదరుడు అవినాశ్ మంగళవారం ఫిర్యాదు చేయగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్ట్రాంగ్ రూమ్,
కౌంటింగ్ కేంద్రం పరిశీలన
పటాన్‌చెరు టౌన్: మండలంలోని రుద్రారం గీతం వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టర్ శరత్, ఎస్పీ రూపేశ్, ఎన్నికల సాధారణ పరిశీలకులు దీపక్ సింగ్లా, పవన్ కుమార్ పరిశీలించారు. వారి వెంట వ్యయ పరిశీలకులు నాజీమ్ జై ఖాన్, పోలీస్ అబ్జర్వర్ దయాల్ గంగ్వార్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
గణేశ్‌గడ్డ ఆలయంలో
విశేష పూజలు
పటాన్‌చెరు టౌన్: మండలపరిధిలో ఉన్న రుద్రారం గణేశ్‌గడ్డ ఆలయంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా అభిషేకాలను సైతం అర్చకులు సంతోష్ జోషి, జగదీశ్వర్ స్వామి, చంద్రశేఖర్ నిర్వహించారు. భక్తులు క్యూలైన్‌లో వెళ్లి స్వామిని దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. నిత్యాన్నదానాన్ని నిర్వహించారు.

స్ట్రాంగ్ రూంను పరిశీలిస్తున్న కలెక్టర్, అధికారులు

ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు