
నామినేషన్లు వేసిన శంకర్‌హిల్స్ బాధితులు వీరే
గజ్వేల్: తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు గురువారం గజ్వేల్‌లో నామినేషన్లు వేశారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లడానికే ఇక్కడ నామినేషన్లు వేసినట్లు తెలిపారు. 35మందికి పైగా నామినేషన్లు వేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వట్టి నాగులపల్లిలో 1983లో తాము 400 ఎకరాల భూమిని రైతుల వద్ద కొనుగోలు చేసి 3300 ప్లాట్లుగా అభివృద్ధి చేసుకున్నామని, వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్లు సైతం పక్కాగా ఉన్నాయని తెలిపారు. 111జీవోతో ఆ ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టలేక పొజిషన్‌లో ఉన్నామని అన్నారు. ధరణి వచ్చిన తర్వాత ఆ ప్లాట్లను వ్యవసాయ భూమిగా రికార్డుల్లో మార్చి బడాబాబులు కాజేయాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని, విసిగిపోయి గజ్వేల్‌లో నామినేషన్లు వేయడం ద్వారా తమ నిరసనను తెలియజేయడానికి నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.