
రెండేళ్ల విరామం తర్వాత వృద్ధి బాటలో
2024లో రూ.1,24,184 కోట్ల ఫండింగ్
ఏడాదిలో 27.8% పెరిగిన నిధులు
అధిక మొత్తం ఈ–కామర్స్ కంపెనీల్లోకి..
ప్రారంభ దశ కంపెనీల హవా
2025 జనవరి–మార్చిలోనూ నిధుల వెల్లువ
దేశంలోని స్టార్టప్స్‌లోకి నిధుల రాక తిరిగి గాడిలో పడింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించిన భారత్‌లో రెండేళ్ల విరామం తర్వాత గత ఏడాదిలో ఫండింగ్‌లో వృద్ధి నమోదైంది. దేశీయ అంకుర సంస్థలు 2024లో మొత్తం రూ.1,24,184 కోట్ల ఫండింగ్ అందుకున్నాయి. 2023తో పోలిస్తే ఇది 27.78 శాతం ఎక్కువ. 2025 జనవరి–మార్చిలో నిధులు.. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 33.57 శాతం పెరిగి రూ.31,820 కోట్లుగా నమోదయ్యాయి.
అంకుర సంస్థల్లో పెట్టుబడులు 2017 నుంచి 2020 వరకు తగ్గుతూ వచ్చాయి. కరోనా మహమ్మారి రాకతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార తీరుతెన్నుల్లో అనూహ్యంగా సమూల మార్పులు వచ్చాయి. అన్ని రంగాల్లోనూ కంపెనీలు ఐటీపై భారీగా వెచ్చించాయి. దీంతో 2021లో రికార్డు స్థాయిలో భారత అంకుర సంస్థల్లోకి రూ.3,26,800 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. ఏడాదిలో మూడింతలకుపైగా దూసుకెళ్లాయి. భారత స్టార్టప్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. అక్కడి నుంచి ఇక తిరుగు ఉండదు అనుకున్నప్పటికీ అందుకు విరుద్ధంగా వరుసగా రెండు సంవత్సరాలు నిధుల రాక తగ్గింది. వడ్డీ రేట్లు పెరగడం; భౌగోళిక, రాజకీయ అనిశ్చితి; ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, కంపెనీల పనితీరు పట్ల ఆందోళనలు.. ఈ క్షీణతకు కారణమయ్యాయి.

‘ఈ–కామర్స్’ జోష్
⇒ 2024లో ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్ కంపెనీలు ఏకంగా రూ.27,778 కోట్ల నిధులను ఆకర్షించడం గమనార్హం. 2024లో అధిక మొత్తం ఫండింగ్ ఈ–కామర్స్ కంపెనీల్లోకి వెళ్లింది. 2023లో దేశీయ అంకుర సంస్థలు రూ.97,180 కోట్ల నిధులు సమీకరించాయి.
⇒ 2024లో టాప్ – 5 రంగాల వారీగా డీల్స్ చూసుకుంటే... ఈ కామర్స్‌లో 222 డీల్స్ జరిగాయి. ఫిన్‌టెక్‌లో 211, హెల్త్ టెక్‌లో 120, సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ 112 డీల్స్ జరిగాయి. ఏఐకి సంబంధించి మాత్రం కేవలం 59 డీల్స్ జరగడం గమనార్హం.
ఈ మార్చి త్రైమాసికంలో ఇలా..
2025 జనవరి–మార్చిలో నిధులు.. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 33.57 శాతం పెరిగి రూ.31,820 కోట్లుగా నమోదయ్యాయి. ఈ త్రైమాసికంలో 319 డీల్స్ జరిగాయి. నాలుగు సంస్థలు మూతపడ్డాయి. అయిదు స్టార్టప్స్ 1,300 పైచిలుకు ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. 2023లో 24,000 మందికి, 2022లో 20,000 మందికి స్టార్టప్ కంపెనీలు ఉద్వాసన పలికాయి. ఉద్యోగుల తీసివేతలు గత ఏడాది అతి తక్కువగా (సుమారు 4,700) నమోదయ్యాయి.