
తెలుసుకుంటే ఏ సమస్య వస్తుందోనన్న భయం
తెలియనిది హాని చేయదని ఎక్కువమంది నమ్మకం
పిల్లలూ, పెద్దల్లో పెరుగుతున్న ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’
మనకు ఇష్టమైనదే వింటాం. ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా, ప్రతికూలంగా ఉన్నా ఆ సమాచారాన్ని వినడానికి కూడా ఇష్టపడం. కనీసం అటువైపు కూడా చూడం. తెలియనిది తమకు హాని కలిగించదని చాలామంది అనుకుంటారు. ఇది పెద్దవారిలో ఒక సాధారణ ప్రవర్తన అని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్ని ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’ టారు. షికాగో విశ్వవిద్యాలయం చేపట్టిన కొత్త అధ్యయనం ప్రకారం యుక్త వయసుకు రాకముందే ఈ ధోరణి అభివృద్ధి చెందుతోందట.
చాలామందికి ఆసుపత్రికి వెళ్లాలంటే భయం. అక్కడ ఏ టెస్టు చేస్తే ఏ సమస్య బయటపడుతుందో అని లోపల ఒక తెలియని ఆందోళన. అందుకే, ‘నువ్వు, ఈ మధ్య టెస్టులు చేయించుకున్నావా’ అని ఎవరైనా అడిగితే.. సంభాషణను వేరే విషయాలవైపు మళ్లిస్తుంటారు. కొన్ని కంపెనీలు లేదా సంస్థలు.. ఉచిత వైద్య శిబిరాలు పెట్టినప్పుడు కొందరు కనీసం అటువైపు కూడా చూడంది అందుకే. ఆస్ట్రిచ్ ఎఫెక్ట్‌గా పిలిచే ఈ ధోరణి పెద్దలతో పాటు పిల్లల్లోనూ ఉంటోందట.
చిన్న పిల్లల్లోనూ..
షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన రాధిక సంతాన గోపాలన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం.. పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ కొత్త సమాచారాన్ని స్వీకరించని మనస్తత్వ ధోరణి పెరుగుతున్నట్టు గుర్తించింది. ముఖ్యంగా ఇది 7–10 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా ఉందట. అసలు చాలామంది.. కొత్త విషయాన్ని లేదా జ్ఞానాన్ని నేర్చుకునే విషయంలో ఎందుకు విముఖత చూపుతారో 5 కారణాలను ఈ బృందం గుర్తించింది.
తప్పించుకునే ధోరణి
ఐదారేళ్ల పిల్లలు మరింత జ్ఞానం సంపాదించాలని ఉత్సాహంగా ఉన్నారు. 7 నుంచి 10 ఏళ్ల చిన్నారుల్లో కొందరు మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నారు. వీళ్లు సమాచారం నుంచి తప్పించుకునే ధోరణులను ప్రదర్శించడం ప్రారంభిస్తున్నారు. ‘ఉదాహరణకు, ప్రతి ఒక్కరినీ తమకు ఇష్టమైన, తక్కువ ఇష్టమైన క్యాండీ ఏంటో చెప్పండని అడిగాం. ఆ క్యాండీ వారి దంతాలకు ఎందుకు చెడ్డదో వివరించే వీడియో చూడాలని అనుకుంటున్నారా అని అడిగాం. ఆసక్తికరంగా.. వారికి నచ్చే దాని గురించి వారు ‘అది ఎందుకు చెడ్డదో’ తెలుసుకోడానికి ఇష్టపడలేదు. కానీ తక్కువ ఇష్టమైన క్యాండీ ఎందుకు చెడ్డదో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు’ అని వివరించారు రాధిక.
అన్ని వేళలా మంచిది కాదు
‘కొన్ని సందర్భాల్లో సమాచారం నుంచి తప్పించుకోవడం మంచిదే. అతి సర్వత్రవర్జయేత్ అన్నారు కదా! అయితే ప్రతిసారీ వద్దనుకునే ధోరణి మంచిది కాదు. అప్పటికి మనకు నచ్చనిది లేదా మనసుకు ఇబ్బందిగా అనిపించేది తరవాత విలువైనదని తేలవచ్చు. మనుషులకు అనిశ్చితిని లేదా ఒక సమస్యను పరిష్కరించుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ పరిష్కారం, సమాచారం తమకు ఇబ్బందికరంగా లేదా ముప్పుగా ఉన్నప్పుడు తప్పించుకోవడానికే మొగ్గు చూపుతారు. కాస్త చొరవ, ధైర్యం చూపెడితే చాలు.. దీన్నుంచి సులభంగా బయటపడవచ్చు’ అంటారు రాధిక.
ఏమిటీ ఆస్ట్రిచ్ ఎఫెక్ట్?
యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంలోని ఇద్దరు ప్రొఫెసర్లు డాన్ గలాయ్, ఓర్లీ సేడ్.. మొట్టమొదట ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’ అనే పద బంధాన్ని ప్రయోగించారు. ఇజ్రాయెల్‌లోని క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడిదారులు.. ఎప్పటికప్పుడు నష్ట సమాచారాన్ని వెల్లడించే మార్గాల కంటే.. తమకు నష్టం వచ్చినా ఫర్వాలేదని ఆ విషయం బయటకు చెప్పని మార్గాల్లోనే పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నట్టు గుర్తించారు.
ఈ ధోరణిని ఆస్ట్రిచ్ ఎఫెక్ట్‌గా అభివర్ణించారు. ఆస్ట్రిచ్ పక్షి తనకు ఏదైనా ప్రమాదం వస్తుందనిపిస్తే.. వెంటనే తన తలను ఇసుకలో దాచేస్తుందని దీని అర్థం. నిజానికి ఆస్ట్రిచ్ అలా చేయదు. కానీ, ఇది మాత్రం మానసిక వైద్య శాస్త్రంలో ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’గా స్థిరపడిపోయింది.
ఎందుకు తప్పించుకుంటారు?
⇒ ఆందోళన లేదా నిరాశ వంటి ప్రతికూల భావోద్వేగాలను నివారించడం
⇒ ఇతరులు మన ఇష్టాయిష్టాలను, సామర్థ్యాలను ఎలా అర్థం చేసుకుంటారో అనే ఆందోళన, భయం
⇒ మన నమ్మకాలను సవాలు చేసే ఆలోచనలు, వాస్తవాల నుంచి తప్పించుకునేందుకు
⇒ మన ప్రాధాన్యతలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు
⇒ స్వార్థం లేదని నిరూపించుకునే క్రమంలో.. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం