మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా?

Gujarat Himachal Assembly Results Impact On General Elections 2024 - Sakshi

వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం ఎలా ఉంటుంది? 

గుజరాత్, హిమాచల్‌ ఫలితాలు ఏం చెబుతున్నాయి?

ఒక రాష్ట్రంలో మోదీ మేనియాతో ఊగిపోయే ప్రజలు, మరో రాష్ట్రంలో స్థానిక సమస్యలే ముఖ్యమని ఎలుగెత్తి చాటిన ఓటర్లు .. ఒకే రోజు రెండు రాష్ట్రాల్లో రెండు విభిన్నమైన తీర్పులు. ఈ రెండు రాష్ట్రాల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్ని ఎలా ప్రభావితం చేస్తాయి ? ప్రధాని మోదీ బ్రాండ్‌ ఇమేజ్‌ చెక్కు చెదరకుండా ఉంటుందా ? మోదీని ఢీ కొట్టే నాయకుడు కేజ్రీవాలా ? రాహులా ? గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఫలితాలు చెబుతున్నదేంటి ? 

గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్న చర్చ మొదలైంది. విపక్షాలను నిరీ్వర్యం చేసి అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని, హిందుత్వ–జాతీయవాదాన్ని జనంలోకి బాగా తీసుకువెళ్లాలని, ఉచితాలకు బదులుగా అభివృద్ధి బాట పడితేనే దేశానికి మేలు జరుగుతుందన్న బీజేపీ ఎజెండాకు గుజరాత్‌ ఫలితాలు ఆమోద ముద్ర వేశాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా పని చేస్తుందన్న ధీమాను నింపాయి. అదే సమయంలో స్థానిక సమస్యలపై గట్టి పోరాటం చేస్తే బీజేపీని, మోదీ బ్రాండ్‌ ఇమేజ్‌ను ఎదుర్కోవడం కష్టం కాదన్న ఆశ కూడా ప్రతిపక్ష పారీ్టల్లో చిగురించింది.  

బ్రాండ్‌ మోదీ ప్రభావం
మోదీ ఇమేజ్‌ చెక్కు చెదరకపోయినప్పటికీ బలమైన స్థానికాంశాలుంటే రాష్ట్రాల్లో గెలుపుకు విపక్షాలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ ఫలితాలు చెబుతున్నాయి. హిమాచల్‌లో పాత పెన్షన్‌ పునరుద్ధరిస్తామన్న ఒకే ఒక్క హామీ కాంగ్రెస్‌ని అధికార పీఠానికి చేర్చింది. సోలన్‌ ప్రాంతంలో మోదీ ర్యాలీలకు జనం పోటెత్తినా అక్కడి 5 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒక్కటీ నెగ్గలేకపోయింది! కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హిందూత్వ, జాతీయవాదమే కీలకపాత్ర పోషించేలా కనిపిస్తున్నాయి. హిమాచల్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల శాతంలో తేడా ఒక్క శాతమే! ‘‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టడం సులభం కాదు. హిమాచల్‌లో మాదిరిగా స్థానికాంశాలు లోక్‌సభ ఎన్నికల్లో పని చేయవు’’ అని జేఎన్‌యూ పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫసర్‌ మణీంద్రనాథ్‌ ఠాకూర్‌ అభిప్రాయపడ్డారు. హిమాచల్‌ ఓటమితో ఇమేజ్‌కు వచి్చన ఢోకా ఏమీలేదన్నారు.  

కాంగ్రెస్‌ పక్కలో బల్లెం ఆప్‌
బీజేపీతో తలపడడానికి,  హిందూత్వ ఎజెండాతో ఓటర్లను ఏకీకృతం చేస్తున్న కమలనాథుల కు చెక్‌ పెట్టడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు ఆప్‌ రూపంలో కొత్త శత్రువు ఎదురైంది. గుజరాత్‌లో ఆప్‌ ప్రధానంగా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకునే కొల్లగొట్టడంతో 17 స్థానాలకే పరిమితమవాల్సి వచి్చంది. కాంగ్రెస్‌ ఓట్లు 41% నుంచి 27శాతానికి పడిపోతే, ఆప్‌ 13% ఓట్లు సాధించిందంటే కాంగ్రెస్‌ ఓట్లకు గంటికొట్టినట్టయింది. ‘‘వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు అసలు సిసలు శత్రువు ఆప్‌ అంటే అతిశయోక్తి కాదు. విపక్షాల మధ్య ఓట్లు చీలిపోతుంటే బీజేపీ సేఫ్‌ గేమ్‌ ఆడుతోంది. ఆప్‌ను ఎదుర్కొనే బలమైన వ్యూహాన్ని కాంగ్రెస్‌ తక్షణమే రచించాలి.’’ అని ఎన్నికల విశ్లేషకుడు ఠాకూర్‌ హెచ్చరించారు. హిమాచల్‌ ప్రదేశ్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ పెద్దగా దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే సాధించింది.  అది కాంగ్రెస్‌కి కలిసొచ్చింది. అదే ఆప్‌ కూడా విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే కాంగ్రెస్‌ పని అయిపోయి ఉండేదని ఆ పార్టీ మాజీ నాయకుడు సంజయ్‌ ఝా అన్నారు. అయితే హిమాచల్‌లో విజయం సాధించడం వల్ల కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడుకి చేరడంతో పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని పెంచినట్టయింది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది.  

సెమీ ఫైనల్స్‌ ఫలితాలే కీలకం
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు ఉందా లేదా అనేది వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాల్లో జరిగే సెమీఫైనల్స్‌ వంటి ఎన్నికల ఫలితాలే కీలకం కానున్నాయి. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ పార్టీ హోదా లభించిన ఉత్సాహంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేయడానికి  సిద్ధమవుతోంది. దీంతో కాంగ్రెస్‌ అటు బీజేపీ, ఇటు ఆప్‌ను సమర్థంగా ఎదుర్కోవాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనే నాయకుడు కేజ్రివాలా? రాహులా? అన్నది తేలిపోతుంది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top