పిల్లల ఎదుగుదలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లల ఎదుగుదలపై దృష్టి సారించాలి

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

షాద్‌నగర్‌: పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులతో నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సరికొత్త సవాళ్ల నుంచి రక్షించాలని సూచించారు. సెల్‌ఫోన్‌లకు అతుక్కపోకుండా నియంత్రిస్తూ వారి భవిష్యత్తును దృష్టికొని పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సైబర్‌ నేరాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. 14 ఏళ్లు దాటిన బాలికలకు గర్భాశయ క్యాన్సర్‌ నివారణలో భాగంగా హెచ్‌పీవీ టీకా తప్పనిసరి వేయించాలని చెప్పారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, మహిళా సంఘాలకు అందిస్తున్న వడ్డీ లేని రుణాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు తమ కాళ్ల తాము నిలబడేందుకు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమానికి పాటు పడుతోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ గురుకుల పాఠశాలలను నిర్మిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు తాము తయారు చేసిన వస్తువులకు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆర్‌డీఓ సరిత, మున్సిపల్‌ చైర్మన్‌ అగ్గునూరు బస్వం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సులోచన కృష్ణారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అందె మోహన్‌, ఏసీపీ లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ సునీత, ఏంఈఓ మనోహర్‌, ఎంపీడీఓ బన్సీలాల్‌, తహిసీల్దార్‌ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ కిరణ్మయి

Advertisement
 
Advertisement
Advertisement