ఇబ్రహీంపట్నం రూరల్: అర్హులైన ప్రజలకు నూరు శాతం సంక్షేమ పథకాలు అందజేసే బాధ్యత అధికారులపై ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్థాయి సమావేశం బొంగ్లూర్‌లోని ఓ కన్వెన్షన్ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తేనే ప్రజాపాలనకు అర్థం ఉందన్నారు. అఽధికారులు కొందరు బాగా పని చేస్తున్నారని, మరి కొందరు చేయడం లేదన్నారు. అందరూ సమన్వయంతో పని చేస్తే బాగుంటుందన్నారు. గ్రామాలకు వెళ్లాలని, కార్యాలయాల్లో ఉంటే సరిపోదన్నారు.
కబ్జా చేసిన భూములు లాగి పేదలకు పంచుతా..
పేదవాడు 60 గజాల జాగలో ఇళ్లు కట్టుకుంటే కూల్చివేస్తారు. కానీ నేడు పదుల ఎకరాల్లో భూములు కబ్జాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే మల్‌రెడ్డి అన్నారు. అలాంటి వారు ఎక్కడున్నా చెప్పండి వారి నుంచి గుంజుకొని పేదలకు పంచుతానన్నారు. కబ్జాదారులు సీఎం పేరు చెప్పినా, మంత్రుల పేరు చెప్పినా, తన పేరు చెప్పినా సహించేది లేదన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడైన పేదలకు దక్కేలా చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ అనంతరెడ్డి, హౌసింగ్ పీడీ చంప్లానాయక్, తహసీల్దార్ సునీత, వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక మధుసూదన్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఆదిబట్ల సర్కిల్ కమిషనర్ సత్యనారయణరెడ్డి, ఇబ్రహీంపట్నం కమిషనర్ సుదర్శన్, డీఎస్‌ఓ వనజాత, నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, పాండురంగారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


