ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల బీరప్ప జాతరలో జరిగిన జంతుబలిపై కేసు నమోదైంది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శివరాత్రి వెంకటేశ్ కథనం ప్రకారం.. ఆదిబట్లలో ఏప్రిల్ 27న బీరప్ప జాతరలో భాగంగా గొర్రె పొట్టేళ్లను దేవాలయం ముందు బలిచ్చారు. ఈ వీడియోలను కొందరు యువకులు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. వీటిని చూసి చలించిన స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌జీఓ క్రూయాలిటీ ప్రివెన్షన్ మేనేజర్ అడులపురం గౌతమ్ అనే వ్యక్తి ఏప్రిల్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జాతర నిర్వాహకులైన 15 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
భిక్షాటన చేస్తూ మృతి
కందుకూరు: అనారోగ్యంతో ఓ భిక్షగాడు మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పులిమామిడిలోని కోటమైసమ్మ దేవాలయం సమీపంలో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన వివరాల ఆధారంగా అతను వెంకటయ్యచారి అలియాస్ పెంటయ్యచారి (60), ఆదిలాబాద్ జిల్లాగా గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా గ్రామ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ, మద్యం తాగుతూ రోడ్డు పక్కనే నివసించేవాడు. తరచూ ఫిట్స్ కూడా వచ్చేవి. శుక్రవారం రాత్రి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి పూర్తి వివరాలు తెలిస్తే 87126 62687, 87126 62409, 87126 62369 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
11 నుంచి వేసవి శిబిరం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా సహకారంతో గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చిన్నారుల కోసం ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 11 నుంచి 16 వరకు ఈ శిక్షణ ఉంటుంది. ట్రాఫిక్‌పై అవగాహన, రోడ్డు భద్రతతోపాటు ఆత్మరక్షణ, డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, కార్టూనింగ్, చేతిరాత మెరుగుపరచుకోవడం, వ్యక్తిత్వ వికాసం, ప్రాథమిక అత్యవసర వైద్యచికిత్స వంటి అంశాలపై శిక్షణ ఉంటుంది. రిజిస్ట్రేషన్లు ఈ నెల 3 నుంచి ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాల కోసం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్‌స్పెక్టర్ జి.హరీశ్ 87126 60655, లేదా కార్యాలయ అసిస్టెంట్ 98480 63345 నంబర్లలో సంప్రదించవచ్చు.
5 నుంచి చిత్రలేఖనంపై శిక్షణ
నాంపల్లి: వేసవి సెలవుల్లో కిడ్స్ ఆర్ట్ క్యాంపు పేరిట ఆన్‌లైన్‌లో చిన్నారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. తరగతులు మే 5న ప్రారంభమై జూన్ 5వ తేదీన ముగుస్తాయని, వారానికి రెండురోజులు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. 7 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కోరారు. జేఎన్‌ఎఫ్‌ఏయూలో తర్ఫీదు పొందినవారు డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్స్ అనే అంశాలపై శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఫోన్: 63043 66780.


