డివైడర్‌ నుంచి దూసుకెళ్లి బైక్‌ను ఢీకొట్టి.. | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ నుంచి దూసుకెళ్లి బైక్‌ను ఢీకొట్టి..

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

ప్రమాదంలో ఒకరి మృతి

చేవెళ్ల: డీసీఎం డ్రైవర్‌ అతివేగం అజాగ్రత్తతో డివైడర్‌ నుంచి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. షాబాద్‌ మండలం పోతుగల్‌ గ్రామానికి చెందిన మల్కని నర్సింలు (45) నగరంలోని విద్యానగర్‌లో ఉంటూ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామంలో భార్య సువర్ణ కుటుంబసభ్యులు ఉంటున్నారు. వారంలో ఒకరోజు, సెలవు ఉన్న సమయంలో గ్రామానికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం మేడే సందర్భంగా సెలవు ఉండడంతో తన బైక్‌పై ఇంటికి వచ్చిన అతడు శనివారం ఉదయం తిరిగి నగరానికి బయలుదేరాడు. మార్గమధ్యలో చేవెళ్ల మండలం పామెన బస్‌స్టేజీ వద్దకు రాగానే ఎదురుగా చేవెళ్ల వైపు నుంచి వస్తున్న డీసీఎం అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ నుంచి దూసుకెళ్లి రోడ్డు అవతల వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న నర్సింలు ఎగిరి దూరంగా పడడంతో కాలు విరిగి తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నా రు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement