యాచారం: డ్వాక్రా సంఘాల్లోని ఐదో తరగతిలోపు చదువు రాని మహిళలు నేడు ఆయా గ్రామాల్లో పరీక్ష రాయనున్నారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో అక్షరాస్యత లేని 4,500 మంది మహిళలను గుర్తించారు. రాత్రిపూట అడల్ట్ ఎడ్యుకేషన్ ద్వారా మహిళలకు చదువు నేర్పించారు. అందులో రెండు వేల మందిని మొదటి దఫా కింద ఆదివారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష రాయిస్తారు. అందుకు గాను శనివారం మండల ఐకేపీ కార్యాలయంలో మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ రాధారాణిలు పరీక్ష నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పరీక్షలో పాసైన మహిళలకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ప్రతి డ్వాక్రా మహిళ అక్షరాస్యత సాధించడం కోసం కృషి చేస్తున్నామని ఎంపీడీఓ తెలిపారు.


