మహేశ్వరం: మండల పరిధిలోని నందుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను డివిజన్ హౌసింగ్ డీఈ భిక్షు, ఏఈ చైతన్య శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్మాణాలను వేగిరం చేయాలని అన్నారు. పనుల ఫొటోలను అప్‌లోడ్ చేస్తే బిల్లులు దశలవారీగా లబ్ధిదారుల అకౌంట్‌లో జమ అవుతాయన్నారు. త్వరితగతిన పూర్తి చేసి బిల్లులు పొందాలని సూచించారు. ప్రభుత్వ నియమాల ప్రకారం నిర్మాణం చేపట్టాలని, నిబంధనలు అతిక్రమించి చేస్తే బిల్లులు రావని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దేశపాగ నర్సింహలు, ఉప సర్పంచ్ షేక్ ఎజాస్, పంచాయతీ కార్యదర్శి జానయ్య తదితరులు పాల్గొన్నారు.
గాలివాన.. హైరానా
Mar 29 2026 8:53 AM | Updated on Mar 29 2026 8:53 AM
గాలివాన.. హైరానా
తుర్కయంజాల్: గాలివాన సృష్టించిన బీభత్సంతో శుక్రవారం రాత్రి తుర్కయంజాల్ సబ్‌స్టేషన్ పరిధిలోని అనేక కాలనీల్లో అంధకారం నెలకొంది. విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రి, పగలు శ్రమించినా అనేక కాలనీల్లో శనివారం సైతం సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సాగర్ రహదారి మాసబ్ చెరువు కట్టపై రెండు భారీ చెట్లు కూలి రోడ్డుపై పడ్డాయి. దీంతో నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డుపై వాహనాలను దారి మళ్లించి ఒకే లైన్‌లో పంపించారు. ఈదురు గాలులకు అనేకచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. బ్రాహ్మణపల్లిలో 7, మునగనూర్‌లోని అంజనాపురి కాలనీలో 6 విద్యుత్ స్తంభాలు విరిగిపోయి తీగలు తెగిపడినట్లు విద్యుత్ శాఖ ఏఈ రాములు తెలిపారు.
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
ఇబ్రహీంపట్నం: నిర్లక్ష్యం ప్రాణాలను బలితీసుకోవచ్చని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి శనివారం ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పు ఎవరి పక్షాన జరిగినా ఆ ప్రభావం రెండువైపులా ఉంటుందని పేర్కొన్నారు. ఆయా కుటుంబాలు జీవితాంతం బాధపడే పరిస్థితులు ఉంటాయన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి
సహకరిస్తాం
చేవెళ్ల: ఆలయాల అభివృద్ధికి దాతలు ముందుకు వస్తే సహకరిస్తామని దేవాదాయ ధర్మాదాయశాఖ రాష్ట్ర స్థపతి వల్లి నాయగం అన్నారు. చేవెళ్లలోని శ్రీబాలాజీ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం పక్కనే ఉన్న శివాలయాన్ని గ్రామానికి చెందిన కొందరు దాతలు ముందుకు వచ్చి నిర్మించాలని చూస్తున్నారని, దీనికి ఏవైనా అభ్యంతరాలు, అనుమతులు ఉంటాయా అని గ్రామస్తులు ఆయనను అడిగారు. పురాతన ఆలయాల పునరుద్ధరణ చేపట్టాలనే సంకల్పం మంచిదేనని అన్నారు. దాతలు ముందుకు వస్తే ఎండోమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఆయన వెంట ఆలయ ఈఓ నరేందర్, పూజారులు వామనాచారి, శ్రీపాదు, వైభవ్, ఎంఎం క్రిష్ణన్ తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల
నిర్మాణాల పరిశీలన
Advertisement
Advertisement


