సమస్యల స్వాగతం!
రెండేళ్ల తర్వాత కొలువుదీరనున్న పాలకవర్గాలు 22న ప్రమాణం చేయనున్న నూతన సర్పంచ్‌లు సవాల్‌గా మారనున్న నిర్వహణ భారం 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొత్తగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. నిధుల లేమితో రెండేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు కొత్త పాలకవర్గాలకు సవాల్‌గా మారబోతున్నాయి. సీసీరో డ్లు, డ్రైనేజీ కాల్వలు వంటి అభివృద్ధి పనులకు నోచు కోకపోవడంతో పాటు పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, కరెంట్ బిల్లులు, తరచూ వచ్చే మోటార్ల రిపేర్లు, ట్రాక్టర్ నిర్వహణ ఖర్చులు ఆర్థికంగా పెనుభారంగా మారబోతున్నాయి. పంచాయతీ పగ్గాలు చేపబట్టబోతున్న కొత్త పాలకవర్గాలన్నీ 15వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలు పెట్టుకున్నాయి.
ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 25న జిల్లాలోని 526 పంచాయతీలు, 4,668 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించింది. ఈనెల 11న మొదటి విడతలో భాగంగా 174 పంచాయతీలు సహా 1,530 వార్డులకు.. రెండో విడతలో 178 పంచాయతీలు, 1,540 వార్డులకు ఈనెల 14న, మూడో విడతలో 174 పంచాయతీలు సహా 1,598 వార్డులకు ఈ నెల 17న ఎన్నికలు నిర్వహించింది. కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి పంచాయతీ మినహా మిగిలిన అన్ని చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. సర్పంచులు సహా వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ 22న ఉదయం 10.30 గంటలకు చేపట్టనున్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లోనూ ఒకే సమయంలో నిర్వ హించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులతో ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదే రోజు నుంచి కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.
పెండింగ్‌లో నిధులు..
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం 2019లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆయా పాలకమండళ్ల పదవీకాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతూ వచ్చాయి. పాలక వర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలు సహా పరిషత్‌లకు 2024–2025, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రూ.2000 కోట్లకుపైగా నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మేజర్ పంచాయతీల్లో ఆస్తిపన్నులు కూడా ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. తండాలు, ఇతర చిన్న పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కార్యదర్శులు చిన్నచిన్న అవసరాలకు అప్పులు చేయాల్సి వచ్చింది. చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ఇప్పటికే మెజార్టీ గ్రామ పంచాయతీల్లో పని చేయడం లేదు. డీజిల్ సహా చిన్నచిన్న రిపేర్లు చేయించేందుకు సైతం నిధులు లేకపోవడం ఇబ్బందిగా మారింది. షెడ్డుకు చేరిన ట్రాక్టర్లు మళ్లీ వీధుల్లో పరుగులు తీయాలన్నా.. పేరుక పోయిన చెత్తను ఎత్తిపోయాలన్నా ఎంతో కొంత నిధులు అవసరం. 15వ ఆర్థిక సంఘం విదిల్చే నిధులపైనే కొత్త పాలకమండళ్లు ఆశలు పెట్టుకున్నాయి.
నిధుల లేమితో అభివృద్ధికి నోచుకోని పల్లెలు
లెక్క చెప్పాల్సిందే..
గెలుపొందిన అభ్యర్థులతో పాటు ఓటమి పాలైన వారు సైతం తమ ఎన్నికల ఖర్చు వివరాలను 45 రోజుల్లో వెల్లడించాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఐదు వేల జనాభా ఉన్న చోట సర్పంచ్ అభ్యర్థి ఖర్చు రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేలుగా నిర్ణయించింది. ఐదు వేలకు మించి జనాభా ఉన్న స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థి ఖర్చు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడి ఖర్చు రూ.50 వేలుగా నిర్ణయించింది. మెజార్టీ పంచాయతీల్లో ఒక్కో సర్పంచ్ అభ్యర్థి రూ.50 లక్షలకుపైనే ఖర్చు చేసినట్లు సమాచారం. తొలి విడత ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థులు జనవరి 24లోగా, రెండో విడత అభ్యర్థులు 27లోగా, మూడో విడత అభ్యర్థులు జనవరి 30లోగా ఎన్నికల ఖర్చులను సంబంధిత ఎంపీడీఓలకు అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఆయా అభ్యర్థులు సమర్పించిన ఖర్చుల వివరాలను పరిశీలించి టీఈపోల్ వెబ్‌లో అప్ లోడ్ చేయనున్నారు. ఫిబ్రవరి 15లోగా తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేయాల్సి ఉంది. తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్లు పంచాయతీరాజ్ చట్టం –2018లోని సెక్షన్ 23 ప్రకారం పదవిని కోల్పోవడంతో పాటు వచ్చే మూడేళ్ల పాటు మరే ఇతర ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం ఉండదు.
సమస్యల స్వాగతం!


