అమరుల ఆశయ సాధనకు సైకిల్ యాత్ర
చేవెళ్ల: తెలంగాణ అమరుల ఆశయ సాధన, గ్రామంలో బెల్టుషాపులు తొలగింపు, ఉద్యమకారులకు గుర్తింపు, పాలకుల్లో మార్పు డిమాండ్లతో ఓ వార్డు సభ్యుడు చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం చేవెళ్లకు చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలం నాగసాన్‌పల్లికి చెందిన ఎన్నారం యాదయ్య ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో నాగసాన్‌పల్లి 1వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. తన గ్రామంలో పైడిమాండ్లను అమలు చేయాలని కోరుతూ గురువారం ఉదయం అసెంబ్లీకి సైకిల్‌యాత్ర ప్రారంభించారు. రాత్రి చేవెళ్ల పరిధిలోని దామరగిద్దకు చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం చేవెళ్లలోని అంబేడ్కర్, పూలే, జగ్జీవన్‌రామ్, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, పండుగల సాయన్న, దొడ్డి కొమురయ్య, ప్రొఫెసర్ జయశంకర్, ఇంద్రారెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పిచారు. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు యాదయ్య ఆలోచనను అభినందించారు. అనంతరం యాదయ్య మాట్లాడుతూ.. సైకిల్ యాత్ర ద్వారా ముందు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తానని, అనంతరం అసెంబ్లీకి చేరుకుని, అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యేలు, మంత్రులకు తన డిమాండ్లను చెబుతానని స్పష్టం చేశారు. చేవెళ్ల నాయకులు టేకుపల్లి శ్రీనివాస్‌యాదవ్, అబ్దుల్ గని, బస్తేపూర్ నర్సింలు తదితరులు యాదయ్యకు వీడ్కోలు పలికారు.


