విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
మంచాల: సర్కార్ బడులు అభివృద్ధి పథంలో పయనించాలంటే కచ్చితంగా ప్రజల భాగస్వామ్యం అవసరమని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యా బోధన, మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సమన్వయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఆరుట్ల స్కూల్ మాదిరిగా రాష్ట్రంలో మరిన్ని పాఠశాలలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్య శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, విద్యా కమిషన్ సభ్యులు పద్మజాషా, జ్యోత్న్స, శివారెడ్డి, ఎస్‌డీఎఫ్ కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గిరిధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


