రెండో విడతలోనూ హస్తందే హవా
ఆమనగల్లు: కాంగ్రెస్ బలపర్చిన శంకర్ కొండ తండా సర్పంచ్ మండ్లీ రాములు విజయోత్సవం
మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్
బలపర్చిన అభ్యర్థుల గెలుపు
పోరాడి ఓటమి పాలైన బీఆర్‌ఎస్ మద్దతుదారులు
ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసిన బీజేపీ
మండలం మొత్తం జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
ఆమనగల్లు 13 03 03 01 06
తలకొండపల్లి 32 09 16 02 05
కడ్తాల్ 24 11 07 02 04
మొయినాబాద్ 19 07 07 04 01
చేవెళ్ల 25 16 03 03 03
శంకర్‌పల్లి 24 12 07 01 04
షాబాద్ 41 17 22 01 01
మొత్తం 178 75 65 14 24
గెలుపొందిన అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల జాబితా ఇలా..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే హవా కొనసాగించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు వీరికి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ మెజార్టీ స్థానాల్లో ఓటమి తప్పలేదు. ఇక బీజేపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. నిజానికీ పార్టీలు, బీఫాంలు, గుర్తులతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. పరోక్షంగా ఆయా అభ్యర్థులకు అధికార, ప్రతిపక్ష పార్టీ లు మద్దతు ప్రకటించాయి. జెండాలకు అతీతంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, మాజీ ఎంపీపీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ప్రముఖుల పల్లెల్లో..
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వికారాబాద్ జిల్లాలోని తన స్వగ్రామమైన మర్పిల్లిలో పార్టీ మద్దతుదారును గెలిపించుకున్నారు. తన ఆధిపత్యానికి అడ్డు లేదని నిరూపించుకున్నారు.
కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డినారాయణరెడ్డి సొంతూరు ఖానాపూర్‌లో తన మద్దతుదారు దుగ్గాపురం అనితను గెలిపించుకుని తన పట్టు నిలుపుకొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య నవాబుపేట మండలం చించల్‌పేట పంచాయతీలో ఎమ్మెల్యే బలపర్చిన అభ్యర్థి విజయలక్ష్మి ఓటమిపాలయ్యారు. అదే పార్టీ నుంచి రెబల్‌గా పోటీ చేసిన డి.అనసూజ గెలపొందారు.
మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితారెడ్డి తన స్వగ్రామమైన కౌకుంట్లలో బీఆర్‌ఎస్ మద్దతుదారును మల్లారెడ్డిని గెలిపించుకుని చేవెళ్లలోనూ తనకు ఎదురు లేదని నిరూపించుకున్నారు.
చేవెళ్ల లోక్ సభాస్థానం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్వగ్రామమైన గొల్లపల్లిలో బీజేపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టుకోలేకపోయారు. స్వతంత్ర అభ్యర్థి రాఘవేందర్‌కు మద్దతు పలికారు. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ గెలుపొందడం విశేషం.
ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి స్వగ్రామమైన షాబాద్ మండలం గొల్లూరుగూడలో తన ఆధిపత్యాన్ని చాటుకోలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి బదులు బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ మరో ముఖ్యనేత, మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి స్వగ్రామమైన శంకర్‌పల్లి మండలం మాసానిగూడలో తన పట్టు నిలుపుకోలేక పోయారు. ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం.
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ స్వగ్రామమైన కడ్తాల్ మండలం చల్లంపల్లి కాంగ్రెస్ మద్దతుదారు యశోదమ్మ గెలుపొందారు.


