ఊరు.. ఓటుకు..కదిలారు
రెండో విడత పంచాయతీ పోరు ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మంచుతో పాటు చలుగాలులు వీస్తుండటంతో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 11 తర్వాత ఊపందుకుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ కట్టారు. ఉపాధి, ఉద్యోగ నిమిత్తం నగరంతోపాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం పెద్ద ఎత్తున స్వగ్రామాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్, కౌంటింగ్ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగిన పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది.
– సాక్షి, రంగారెడ్డిజిల్లా
పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓటెత్తారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, చంటిపిల్లలతో తల్లులు పోలింగ్ కేంద్రా లకు తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రంలోకి చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పలుచోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. మొదటగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కించిన అధికారులు.. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించారు. తొలి ఫలితం మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే వెల్లడైంది. రాత్రి తొమ్మిది తర్వాత కూడా కొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించారు. 144 సెక్షన్ అమలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరిన వారిని పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టారు.
ఆమనగల్లు: చంటిపిల్లలతో వస్తున్న మహిళలు
ముగిసిన రెండో విడత పంచాయతీ పోరు
జిల్లాలోని ఏడు మండలాల్లో ఎన్నికలు
ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు
85.3 శాతం ఓటింగ్ నమోదు
పల్లెల్లో పండుగ వాతావరణం


