తొలి విడతకు తెర | - | Sakshi
Sakshi News home page

తొలి విడతకు తెర

Dec 10 2025 9:33 AM | Updated on Dec 10 2025 9:33 AM

తొలి విడతకు తెర

తొలి విడతకు తెర

షాద్‌నగర్‌: వారం రోజులుగా గ్రామాల్లో హోరెత్తిని మైకులు మూగబోయాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్‌, వార్డు ఎన్నికల కోసం బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పత్రాలతో పాటు సామగ్రిని బుధవారం ఆయా మండల కేంద్రాల్లో సిబ్బందికి అందజేయనున్నారు.

7 మండలాలు.. 168 పంచాయతీలు

ఈనెల 11న (గురువారం) షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఏడు మండలాల్లో 168 పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తూరులో 12 పంచాయతీల్లో 110 వార్డులకు, నందిగామలో 18 పంచాయతీల్లో 170 వార్డులకు, కేశంపేటలో 28 పంచాయతీల్లో 260 వార్డులకు, కొందుర్గులో 19 పంచాయతీల్లో 186 వార్డులకు, జిల్లేడు చౌదరిగూడలో 24 పంచాయతీల్లో 204 వార్డులకు, ఫరూఖ్‌నగర్‌లో 46 పంచాయతీల్లో 405 వార్డులకు, శంషాబాద్‌లో 21 పంచాయతీల్లో 190 వార్డులకు, సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

అందించే సామగ్రి ఇవే..

బ్యాలెట్‌ బాక్సులు, పేపర్లు, ఓటర్ల జాబితా, సిరా బుడ్డి, బ్యాలెట్‌ బాక్సులు సీల్‌ చేసే సీళ్లు, అడ్రస్‌ బ్యాగులు, రబ్బరు స్టాంపులు, అగ్గిపెట్టె, అట్ట పెట్టెలు, పోలింగ్‌ ఏజెంట్‌ నియామకం, బ్యాలెట్‌ పేపర్‌ అకౌంట్‌, రసీదు పుస్తకం, వయస్సు నిర్ధారణ డిక్లరేషన్‌, ప్రిసైడింగ్‌ అధికారుల రోజు వారీ పుస్తకం, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు, సీల్డు కవర్లు, పెన్నులు, పెన్సిళ్లు, డ్రాయింగ్‌ పిన్నులు, లక్క, జిగురు, బ్లేడు, కొవ్వొత్తులు, ట్విన్‌ దారం, వైరు, కార్బన్‌ పేపర్‌, గోనె బస్తా, చెక్‌ లిస్టు వంటి సామగ్రి పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రంలో అవసరం ఉంటుంది. వీటన్నింటినీ సిబ్బందికి అందజేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

అదనంగా బ్యాలెట్‌ పేపర్లు

ప్రతి గ్రామానికి కావాల్సిన బ్యాలెట్‌ పత్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్‌, వార్డు అభ్యర్థులకు కావాల్సిన పేపర్లను వేర్వేరుగా తీసి ఉంచారు. ఓటర్ల సంఖ్య కంటే బ్యాలెట్‌ పత్రాలు పదిశాతం అదనంగా ఉండనున్నాయి. ఎన్నికల్లో టెండర్‌ ఓట్లు వేసే అవకాశాలు ఉండటంతో బ్యాలెట్‌ పేపర్లను ప్రతి కేంద్రంలో అధికంగా ఉంచనున్నారు. మండల కేంద్రాల నుంచి ఆయా పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందిని, సామగ్రిని తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.

సిబ్బంది నియామకం

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్‌, జోనల్‌ ఆఫీసర్లు, రూట్‌ ఆఫీసర్లను నియమించింది. ప్రతి పంచాయతీకి ఒక ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను కేటాయించారు. ప్రతి మండలంలో పోలీసులు సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

పోస్టల్‌ బ్యాలెట్‌

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించింది. విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ల జారీ కోసం ఆయా మండల కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను స్వీకరించి ఓటు వేసి సీల్డ్‌ కవర్‌ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేస్తున్నారు.

ముగిసిన ప్రచార పర్వం

ఎన్నికల సామగ్రి అందజేతకు ఏర్పాట్లు పూర్తి

నేడు మండల కేంద్రాల్లో సిబ్బందికి పంపిణీ చేయనున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement