అన్నం పెట్టిన ఇంటికే కన్నం
● యజమానిని నమ్మించి రూ.7.50లక్షల నగదు చోరీ
● నిందితుడికి రిమాండ్
షాద్‌నగర్‌రూరల్: అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసాడు ఓ దుండగుడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు వివరాలను ఏసీపీ లక్ష్మినారాయణ వెల్లడించారు. వివరాలు.. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన రాజ్‌కుమార్ షాద్‌నగర్ పరిధి ఎలికట్ట శివారులో దుర్గాస్టీల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణంలో ఎలికట్టలో నివాసం ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన కమల్‌కిషోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 3న దుకాణంలో వచ్చిన కలెక్షన్ నగదు రూ.7.50లక్షలు ఆఫీస్ కేబిన్‌లోని టేబుల్ డెస్క్‌లో పెట్టి సెంట్రల్ లాక్ వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు దుకాణానికి వచ్చిన మేనేజర్ యజమానికి ఫోన్ చేసి నగదు కనిపించడం లేదని సమాచారం ఇచ్చాడు. దీంతో యజమాని అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నగదుతో పాటు సీసీ కెమెరా డీవీఆర్ దొంగిలించినట్లు గుర్తించారు. అక్కడ వాచ్‌మెన్‌గా పనిచేసే బబ్లూను విచారించగా అదే రోజు రాత్రి మేనేజర్ వచ్చి తాళాలు తీసుకున్నట్లు చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందుతుడు చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో మంగళవారం మేనేజర్ కమల్‌కిషోర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ విజయ్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మద్యం బాటిళ్లు సీజ్
మొయినాబాద్ రూరల్: నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తున్న ఆటోను మొయినాబాద్ పోలీసులు సీజ్ చేశారు. సీఐ పవన్‌కుమార్ రెడ్డి తెలిపిన మంగళవారం కనకమామిడి నుంచి వెంకటాపూర్ వైపు ప్రయాణిస్తున్న ఆటోలో మద్యం తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో కనకమామిడి సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టి మద్యం బాటిళ్లు తరలిస్తున్న ఆటోను గుర్తించారు. కాటన్ బీర్లు, 16.44 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి చాకలిగూడకు చెందిన డ్రైవర్ మహ్మద్‌అలీని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
షాద్‌నగర్: రేషన్ డీలర్ వద్ద లంచం తీసుకుంటూ సివిల్ సప్లయ్ డీటీ మంగళవారం ఏసీబీకి చిక్కారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పౌరసరఫరాల శాఖ జిల్లా కార్యాలయంలో డీటీగా పనిచేస్తున్న హనుమరవీందర్‌నాయక్ గత నెల 30న షాద్‌నగర్ పరిధి అన్నారంలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. రెండు క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించి, డీలర్ యాదగిరిపై కేసు నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా కేసును తొలగించి, తిరిగి దుకాణాన్ని తెరిచేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు. షాద్‌నగర్‌లోని రాఘవేంద్ర హోటల్‌లో డీలర్ నుంచి డబ్బులు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. డీటీని అదుపులోకి తీసుకుని, నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
అన్నం పెట్టిన ఇంటికే కన్నం


