కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి..
ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
ఇబ్రహీంపట్నం రూరల్: కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ సైదయ్య కథనం ప్రకారం.. నందిహిల్స్ అల్మాస్‌గూడలో నివాసం ఉండే నారాయణస్వామి(30), వంశీకృష్ణతో పాటు మరో ఇద్దరు స్నేహితులు శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నానికి వచ్చారు. అక్కడే క్రికెట్ మ్యాచ్ చూసి రాత్రి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. తుర్కయంజాల్ మసాబ్ చెరువు కట్ట వద్దకు వెళ్లగానే ఎదురుగా కుక్క అడ్డు రావడంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారులో వెనకాల కూర్చున్న ప్రకాశం జిల్లా దొనకొండకు చెందిన నారాయణస్వామి కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.


