దళితుల భూములు లాక్కోవద్దు
మొయినాబాద్: జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను లాక్కోవద్దని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఈ సంఘటన మొయినాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం సర్వేనంబర్ 218లో యాభై ఏళ్ల క్రితం 36 మంది దళిత కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసుకునేందుకు 6.14 ఎకరాల భూమిని కేటాయించింది. ఈస్థలంలో కోళ్ల ఫారాలు నిర్మించుకున్న పలు దళిత కుటుంబాలు ఉపాధి పొందాయి. ఫారాలు శిథిలావస్థకు చేరడంతో కొంతకాలం క్రితం వీటిని తొలగించారు. అయితే సర్వే నంబర్ 218లో ఉన్న భూమిని ప్రభుత్వం ఇటీవల హెచ్‌ఎండీఏకు అప్పగించింది. ఇందులో దళితులకు కేటాయించిన స్థలాన్ని సైతం కలుపుకొని చదను చేస్తుండటంతో సదరు కుటుంబాలు ఆందోళన చేపట్టాయి.
సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్
ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిని గుంజుకోవద్దంటూ పెద్దమంగళారానికి చెందిన భూ బాధితుడు ముడిమ్యాల రాములు మున్సిపల్ కేంద్రంలోని సెల్‌టవర్ ఎక్కాడు. వారం రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. భూములు గుంజుకుంటే టవర్ పైనుంచి దూకి చస్తానని హంగామా సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పడంతో కిందికి దిగాడు. తహసీల్దార్ గౌతమ్‌కుమార్ స్పందించి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళి ్లసమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో శాంతించిన యువకుడు కిందికి దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత
పెద్దమంగళారంలో దళిత కుటుంబాలకు కోళ్ల ఫారాలకోసం కేటాయించిన భూములను తిరిగి తీసుకోవద్దంటూ శుక్రవారం తహసీల్దార్ గౌతమ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. యాభై ఏళ్ల క్రితం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన సర్టిఫికెట్లను తహసీల్దార్‌కు చూపించారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ భూబాధితులకు తెలిపారు. వినతిపత్రం అందజేసినవారిలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ డప్పు రాజు, నాయకులు సంజీవరావు, భూబాధితులు ఉన్నారు.
మొయినాబాద్‌లో సెల్ టవర్ ఎక్కిన యువకుడు
సముదాయించి కిందికి దింపిన పోలీసులు
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన భూ బాధితులు
దళితుల భూములు లాక్కోవద్దు


