క్రైం కార్నర్..
భారీగా మద్యం పట్టివేత
శంకర్‌పల్లి: గ్రామ ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని శుక్రవారం శంకర్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన సురేశ్, శేఖర్‌లు శంకర్‌పల్లిలో 340 లీటర్ల మద్యాన్ని తీసుకొని మహాలింగాపురం గ్రామానికి కారులో వెళ్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారెడ్డిగూడెం వద్ద కారుని ఆపి తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం, కారుని సీజ్ చేశారు. మరోఘటనలో మోకిలతండాలో నగేశ్ అనే వ్యక్తి కిరాణ దుకాణంలో అక్రమంగా మద్యం అమ్ముతుండగా.. పోలీసులు దాడులు చేసి, 9 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు మోకిల సీఐ వీరబాబు తెలిపారు.
మోసగాడికే మోసం..
పోలీస్‌స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మూసాపేట: ఓ మోసగాడిని మరో మోసగాడు మోసం చేశాడు. దీంతో మొదటి మోసగాడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. కూకట్‌పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. భీమవరానికి చెందిన ఆనంద్ వరప్రసాద్ (28) ఆర్‌టీసి క్రాస్‌రోడ్డులో బాయ్స్ హాస్టల్ ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ కొంతమంది నుంచి ఆనంద్ డబ్బు తీసుకున్నాడు. అయితే ఉద్యోగం ఇప్పించకపోవటంతో డబ్బుల కోసం బాధితులు వేధించసాగారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తాను కానిస్టేబుల్ అంటూ పరిచయం అయ్యాడు. దీంతో ఆనంద్..కానిస్టేబుల్‌ను సహాయం కోరాడు. ఈ క్రమంలో గురువారం సచివాలయం వద్దకు వచ్చిన ఆ వ్యక్తి వర ప్రసాద్‌ను కారులో హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట వరకు తీసుకువెళ్లాడు. మధ్యలో రూ.1.37 లక్షలు అతనికి ఇచ్చాడు. ఆ తరువాత పెద్ద అంబర్ పేటలోనే వదిలివేసి వెళ్లిపోయాడు. ఆనంద్ వరప్రసాద్ అక్కడి నుంచి మెట్రో ట్రైన్‌లో కూకట్‌పల్లికి వచ్చాడు. ఇంటికి వెళ్లలేక కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చి యాప్ ద్వారా పురుగుల మందును ఆర్డర్ చేసుకుని స్టేషన్ ముందే తాగాడు. అతనే 100కు డయల్ చేసి పోలీసులకు తానే సమాచారం ఇచ్చాడు. పోలీసులు స్టేషన్ ముందు ఉన్న ఆనంద్ వరప్రసాద్‌ని గుర్తించి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు కేసును సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
క్రైం కార్నర్..


