గ్రామ పోరుపై ప్రత్యేక నిఘా
● అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల అప్రమత్తం
● ఏడు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌ల గుర్తింపు
కడ్తాల్: స్థానిక సంస్థల ఎన్నికలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా తమ గుర్తులతో గ్రామ పోరులో పోటీ చేయకున్నా మద్దతుదారులు, సానుభూతిపరులతో పల్లెల్లో పట్టు కోసం ఆరాట పడుతున్నాయి. ఈ క్రమంలో ఘర్షణలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశంతో గ్రామాల్లో పోలీసులు నిఘా పెంచారు. అలాగే ప్రలోభాలకు సైతం అడ్డుకుట్ట వేయడానికి చర్యలు చేపట్టారు. కడ్తాల్ మండలంలో శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై ముచ్చర్ల గేట్ కూడలి వద్ద ప్రత్యేకంగా పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్రమంగా మద్యం, నగదు తరలకుండా నిఘా ఉంచారు. మండల పరిధిలో 24 గ్రామ పంచాయతీల్లో రెండో దఫా పంచాయతీ ఎన్నికలు ఈ నెల 14న జరగనున్నాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా కడ్తాల్, మైసిగండి, ముద్వీన్, చరికొండ, చల్లంపల్లి, రావిచేడ్, సాలార్‌పూర్ గ్రామాలను గుర్తించారు. ఇప్పటికే ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలను నియమించారు. ఎనిమిది మంది రౌడీషీటర్లు, 10 మంది సస్పెక్ట్స్, ట్రబుల్ మంగర్స్ 26 మొత్తం 44 మందిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
ప్రజలు సహకరించాలి
మొయినాబాద్‌రూరల్: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అమ్డాపూర్, శ్రీరామ్‌నగర్, కేతిరెడ్డిపల్లి గ్రామాల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నాయకులు, ప్రజలు కృషి చేయాలన్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
శాంతియుత ఎన్నికలకు కవాతు
చేవెళ్ల: పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు పూర్తి సహకారం అందించాలని చేవెళ్ల ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని కోరారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో అనుచిత కార్యకలాపాలు, బెదిరంపులు, గొడవలు సహించేది లేదన్నారు. శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వనం శిరీష, సిబ్బంది పాల్గొన్నారు.


