చేరింది.. పావువంతే!
పూర్తిగా పంపిణీ చేయాలి
చర్యలు చేపట్టాం
షాద్‌నగర్: వర్షాలు సమృద్ధిగా కురిసాయి.. చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయి.. ఈసారి తమ ఉపాధికి డోకా ఉండదని మురిసిపోతున్న మత్స్యకారులకు అందాల్సిన స్థాయిలో చేప పిల్లలు అందకపోవడంతో ఆందోళన మొదలైంది. జిల్లా వ్యాప్తంగా రెండు కోట్లకు పైగా చేపపిల్లలు అవసరం ఉండగా 59 లక్షలు మాత్రమే వచ్చాయి. మిగితా వాటిని కూడా పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలోని 27 మండలాల్లో మొత్తం నీటి వనరులు ఉన్న చెరువులు, కుంటలు వెయ్యికి పైగా ఉన్నాయి. వీటి విస్తీర్ణం సుమారు 15వేల హెక్టార్ల వరకు ఉంటుంది. 208 మత్స్యసహకార సంఘాల్లో 10,128 మంది మత్స్యకారులు ఉన్నారు. సుమారు 15వేల మంది చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. 2016–17లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జిల్లాలోని చెరువు లు, కుంటల్లో సుమారు రెండు కోట్ల చేప పిల్లలను వదలాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
మిగతావి ఎప్పుడో..?
గత ప్రభుత్వ హయాంలో మత్స్యశాఖపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేపపిల్లల పంపిణీపై మొదట్లో నీలినీడలు కమ్ముకున్నాయి. టెండర్లలో జాప్యం కారణంగా ప్రక్రియ నెమ్మదిగా సాగింది. ఈ ఏడాది ఎట్టకేలకు చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే జిల్లాకు ఇప్పటి వరకు 59 లక్షలు మాత్రమే కేటాయించింది. మిగతావి వస్తాయో రావో అని మత్స్యకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేటాయించిన వాటిలో 35–40 ఎంఎం చేప పిల్లలు 30 లక్షలు, 80– 100 ఎంఎం చేప పిల్లలు 29 లక్షలు ఉన్నాయి. వీటి పంపిణీ ప్రక్రియను ఉన్నతాధికారులు ప్రారంభించారు. బొచ్చ, రవ్వ, బంగారు తీగ, గడ్డి రకాల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారు.
ఉపాధిపై పడనున్న ప్రభావం
జిల్లాకు రావాల్సిన కోటాలో పావు వంతు మాత్రమే రావడం.. కేటాయించిన చేప పిల్లలు ఏ నియోజకవర్గంలోని చెరువులు, కుంటల్లో ఎంత మొత్తంలో పంపిణీ చేస్తారో తెలియకపోవడంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఆర్థికంగా నష్టపోతామని వాపోతున్నారు.
గతేడాది కూడా చేప పిల్లలు సరిగా పంపిణీ చేయలేదు. చేపల వేటపై ఆధారపడి ఎంతో మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో పంపిణీ చేసి ఉపాధి కల్పించాలి.
– సురేష్, అధ్యక్షుడు, మత్స్యసహకార సంఘం, గూడురు
ప్రభుత్వం జిల్లాకు ఇప్పటి వరకు 59లక్షల చేప పిల్లలను కేటాయించింది. మరి న్ని చేప పిల్లల కోసం ప్రతి పాదనలు పంపించాం. నీరు నిండిన చెరువులన్నీంటిలో చేప పిల్లలు విడిచే విధంగా చర్యలు చేపట్టాం.
– పూర్ణిమ, జిల్లా మత్స్యశాఖ అధికారి
జిల్లాలో చేపపిల్లల లక్ష్యం 2 కోట్లు
ఇప్పటివరకు కేటాయించింది
59 లక్షలు మాత్రమే..
పూర్తిస్థాయి పంపిణీలో తీవ్ర జాప్యం
ఆందోళనలో మత్స్యకారులు
చేరింది.. పావువంతే!
చేరింది.. పావువంతే!


