రాజీయే రాజమార్గం
ఆమనగల్లు: కేసుల పరిష్కారానికి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి కాటం స్వరూప కోరారు. పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమంలో మొత్తం 82 కేసులు పరిష్కారమయ్యాయి. అంతకుముందు జడ్జి కాటం స్వరూప మాట్లాడుతూ.. కేసుల పరిష్కారంలో రాజీయే రాజమార్గమని తెలిపారు. రాజీపడటం అంటే ఏ ఒక్కరూ ఓడినట్లు కాదని ఇరు వర్గాలు గెలిచినట్లు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ మురళీధర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్తీక్, ఆమనగల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్, సీఐ జానకిరాంరెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లతో సత్వర పరిష్కారం
చేవెళ్ల: లోక్ అదాలత్‌లతో పెండింగ్ కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఏడీజే జడ్జి బి. శ్రీనివాసులు, సీనియర్ సివిల్ జడ్జి కె.దశరథరామయ్య, జూనియర్ సివిల్ జడ్జి యు.విజయ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని కోర్టులో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో 167 కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల కోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు జి.కృష్ణాగౌడ్, ఎం.నర్సింలు, కార్యదర్శి మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు.


