రూ.50 కోట్ల భూమిని కాజేసే యత్నం
● నకిలీ పాసు పుస్తకం, డాక్యుమెంట్లు తయారు చేసిన ముఠా
● బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి ..
● నిందితులకు రిమాండ్
మహేశ్వరం: నకిలీ పత్రాలు సృష్టించి, సుమారు రూ.50 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు యత్నించిన ముఠాను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తుమ్మలూరు సర్వే నంబర్ 247/5లో ఎల్‌బీనగర్‌కు చెందిన రామిడి యాదవ లక్ష్మీకాంత్‌రెడ్డికి 9.4 ఎకరాల భూమి ఉంది. ఇందుకు సంబంధించిన డిజిటల్ సిగ్నీచర్ పెండింగ్‌లో ఉండటంతో ల్యాండ్ రికార్డ్స్ అప్‌డేటింగ్ ప్రోగ్రామ్‌లో అప్‌డేట్ చేయలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులైన కందుకూరు మండలం ధన్నారం గ్రామానికి చెందిన చుక్క శ్రీకాంత్‌గౌడ్, దేవరకొండకు చెందిన నేనావత్ కిషన్‌నాయక్, మాడ్గుల సుద్దపల్లివాసి పందుల దవలయ్యతో పాటు ఆమనల్లులో జిరాక్స్ షాపు నిర్వహించే తాండెం మహేశ్, కల్వకుర్తి మండలం ఉర్కొండలో జిరాక్స్ దుకాణం నడిపే బండి మాధవులు, ఎల్‌బీనగర్‌లోని ఓ జిరాక్స్ షాపులో పనిచేసే కొల్లేటి రాఘవాచారి ఓ ముఠాగా ఏర్పడ్డారు. నకిలీ ఆధార్ కార్డులు, పాసు పుస్తకాలు తయారు చేసి, భూ భారతి పోర్టల్‌లో డిజిటల్ సిగ్నీచర్ అప్‌డేట్ చేయించారు. అనంతరం సదరు భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించేందుకు స్లాట్ బుక్ చేశారు. భూమి పట్టాదారు డిజిటల్ సంతకం కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించడంతో తన పాసు బుక్‌పై స్లాట్ బుక్ అయినట్లు గమనించి పోలీ సులు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముఠా సభ్యులను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వీరిపై గతంలోనూ ఇలాంటి కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, నకిలీ పాసు పుస్తకం, ఆధార్ కార్డులు, చెక్కులు, కంప్యూటర్లు, ప్రింటర్లు తదితర సామగ్రిని కోర్టులో డిపాజిట్ చేశారు.


