క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం
హయత్‌నగర్: క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు మంచి ప్రవర్తన.. దేశభక్తి అలవాటుగా మారుతాయని శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ కుంట్లూర్‌లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఈక్వాలిటీ పేరుతో జరిగిన రాష్ట్రస్థాయి కళాశాల విద్యార్థుల వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో రాణించి దేశానికిపేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. కళాశాల చైర్మన్ మల్క కొమురయ్య మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సంస్కృతి, సాహిత్యాల్లో తగిన ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో దేవనాథ జీయర్ స్వామి, రిటైర్డ్ ఐఏఎస్ జగదీశ్వర్, ఈడీ నవీన్‌కుమార్, ఎస్టీఎస్ మూర్తి, ప్రిన్సిపాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.


