ఫ్లైట్.. మరీ లేట్
సాక్షి, సిటీబ్యూరో/ శంషాబాద్: ఈ నెల 9న శుక్రవా రం రాత్రి 11.55 గంటలు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాం వెళ్లాల్సిన వియత్నాం ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ (వీఎన్ –984) మరికొద్ది సేపట్లో బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. అప్పటికే చాలాసేపటి నుంచి ఫ్లైట్ కోసం ప్రయాణికులు సన్నద్ధమయ్యారు. ఇదే సమయంలో అనౌన్స్‌మెంట్.. సాంకేతిక కారణాలతో వీఎన్–984 విమానం 2 గంటలు ఆలస్యంగా బయలుదేరనుందని ప్రకటన. ప్రయాణికుల్లో ఒక్కసారిగా గందరగోళం. చేసేదేమీలేక 2 గంటలపాటు పడిగాపులు కాశారు. ఏ క్షణంలోనైనా ఫ్లైట్ బయలుదేరవచ్చని భావిస్తున్న తరుణంలో మరో ప్రకటన అశనిపాతంగా వెలువడింది. శనివారం ఉదయమే బయలుదేరుతుందని చెప్పా రు. ఆ ప్రయాణికుల్లో కొంతమంది పసిపిల్లలతో బయలుదేరిన తల్లులున్నారు. వయోధికులు ఉన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవాళ్లు ఉన్నారు. రాత్రంతా విమానం కోసం ఎదురుచూస్తూ గడపాల్సి రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరకు శనివారం మధ్యాహ్నం ష్లైట్ బయలుదేరింది. ఇలా ఒక్క వియత్నాం ఫ్లైట్ మాత్రమే కాదు. ఇక్కడినుంచి రాకపోకలు సాగించే విమానాలు కొంతకాలంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏదో ఒక మార్గంలో తరచుగా రద్దవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
బాంబు బెదిరింపులతో బెంబేలు..
ఎక్కడో ఒకచోట బాంబులు పెట్టినట్లు వచ్చే బెదిరింపులు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోనే కాకుండా ముంబై, ఢిల్లీ, బెంగళూర్ వంటి పలు విమానాశ్రయాల్లో చోటుచేసుకొనే బాంబు బెదిరింపుల కారణంగా ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోతున్నాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం తిరిగి బయలుదేరడంతో గమ్యస్థానాలకు చేరుకోవడంలో గంటల తరబడి ఆలస్యం చోటుచేసుకుంటోంది. ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ నుంచి నాగపూర్ బయలుదేరాల్సిన ఫ్లైట్ (6ఈ7452)కు ఇటీవల బాంబు బెదిరింపు ఘటన కలకలం సృష్టించింది. ‘విమానంలో బాంబు ఉందని, ఏ క్షణంలోనైనా పేలవచ్చు’నని ఓ ఆకతాయి టిష్యూ పేపర్‌పై ఎర్ర ఇంకుతో రాసిన అక్షరాలు ఆందోళనకు గురిచేశాయి. విమానంలో పూర్తిస్థాయిలో భద్రతా తనిఖీలను నిర్వహించారు. 73 మంది ప్రయాణికులతో కూడిన ఆ విమానం ఏకంగా 8 గంటలకు పైగా ఆలస్యంతో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరింది.
గంటల తరబడి ఆలస్యంగా విమానాల రాకపోకలు
బాంబు బెదిరింపులు, సాంకేతిక కారణాలు
తరచూ సర్వీసుల రద్దుతో ఇబ్బందులు
పొగమంచుతో రానున్న రోజుల్లో మరింత జాప్యం
టెర్మినళ్లలో ప్రయాణికుల పడిగాపులు
సారీ.. నో పైలెట్స్..
చివరకు సకాలంలో పైలెట్‌లు ఎయిర్‌పోర్టుకు చేరుకోకపోవడంతోరే విమానాలు ఆలస్యంగా బయలుదేరడం వంటి విచిత్రమైన సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 1న శంషాబాద్ నుంచి ముంబై బయలుదేరాల్సిన ఇండిగో ఫ్లైట్ (6 ఈ–6263) గంటకు పైగా ఆలస్యంగా బయలుదేరింది. విమానాన్ని నడిపే పైలెట్ సిద్ధంగా ఉన్నప్పటికీ కో–పైలెట్ లేకపోవడమే ఇందుకు కారణం. అలాగే.. 178 మంది ప్రయాణికులతో శంషాబాద్ నుంచి మధురై వెళ్లాల్సిన మరో విమానం కూడా సకాలంలో పైలెట్ విధులకు హాజరుకాకపోవడంతో 2 గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
అలాగే.. వాతావరణం అనుకూలించకపోవడంతోనూ విమానాల రాకపోకల్లో ఆలస్యం నెలకొంటోంది. ఇటీవల గోవాకు వెళ్లాల్సిన విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలస్యంగా బయలుదేరింది. ఇటీవల ఒకే రోజు మూడు స్పైస్‌జెట్ విమానాలు సాంకేతిక కారణాలతో ఆలస్యంగా నడిచాయి. రానున్న రోజుల్లో దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉన్నట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అనూహ్యమైన పరిస్థితుల్లో విమానాలు ఆలస్యంగా నడవడం, రద్దు కావడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మందులు, ఇతర అత్యవసర వస్తువులను ప్రయాణికులు తమ వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఫ్లైట్.. మరీ లేట్


