కడుతుంటే ..కళ్లప్పగించి!
సరూర్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలు
ఫిర్యాదు చేసినా స్పందన లేదు
చర్యలు తీసుకుంటాం
హుడాకాంప్లెక్స్: అక్రమ నిర్మాణాలకు సరూర్‌నగర్ డివిజన్ అడ్డాగా మారింది. వంద, రెండు వందల గజాల్లోపు ఖాళీ స్థలాల్లో ఏకంగా ఐదారు అంతస్తులు నిర్మిస్తున్నారు. అనుమతులకు భిన్నంగా సెట్ బ్యాక్ లేకుండా సెల్లార్లతో భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. కళ్లముందు అక్రమ నిర్మాణాలు భారీగా వెలుస్తున్నప్పటికీ.. జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం కళ్లప్పగించి చూస్తుందే కానీ అటు వైపు దృష్టి సారించడం లేదు. తీరా నిర్మాణం పూర్తయి.. గృహ ప్రవేశం సమయం సమీపిస్తున్న సమయంలో షోకాజ్ నోటీసులు జారీ చేసి, యజమానుల నుంచి డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవ్వడానికి నిరాకరించిన వాళ్ల భవనాలను సీజ్ చేసి, ఆ తర్వాత వదిలేస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
నోటీసులతోనే సరి
డివిజన్‌లోని వెంకటేశ్వరకాలనీ సర్వే నంబర్ 9లోని ఓ అక్రమ నిర్మాణంపై కూడా స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు సదరు భవన యజమానికి నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత భవన యజమాని భయపడి వారు అడిగినంత ముట్టజెప్పడంతో ఆ అంశాన్ని విస్మరించారు. ఎప్పటికప్పుడు కాలనీల్లో పర్యటించి, అనుమతులకు భిన్నంగా నిర్మిస్తున్న భవనాలను అడ్డుకోవాల్సిన టీపీఓ విభాగం అధికారులు.. అక్రమార్జనే ధ్యేయంగా పని చేస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఇచ్చేందుకు నిరాకరించిన భవనాలను కూల్చి వేస్తూ.. ఇచ్చిన వాళ్ల వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారుల తీరుతో ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోతుండటంతో పాటు ఆక్రమణలతో వీధులన్నీ ఇరుగ్గా మారి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సరూర్‌నగర్ సర్కిల్ ఎస్‌బీఐ కాలనీలోని ఓ యజమాని తనకున్న 300 గజాల విస్తీర్ణంలో ఐదంతస్తులకు అనుమతి తీసుకుని, కనీస సెట్ బ్యాక్ లేకుండా సెల్లార్ నిర్మాణ పనులు చేపట్టారు. అనుమతి లేకుండా సెల్లార్ తవ్వడంతో పాటు తీసుకున్న అనుమతతులకు భిన్నంగా మరో అంతస్తు నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదులు అందడంతో టీపీఓ విభాగం అధికారులు రెండు రోజుల క్రితం భవనాన్ని సీజ్ చేశారు. ఆ తర్వాత రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లకు తలొగ్గి అటు వైపు వెళ్లడం మానేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతుండడం గమనార్హం.
ఇష్టారీతిన సెల్లార్ తవ్వకాలు
అనుమతి లేకుండా అదనపు అంతస్తులు
ఇలా సీజ్ చేసి.. అలా వదిలేస్తున్న అధికారులు
ఓ భవనం సెల్లార్ తవ్వకం దశలోనే ఫిర్యాదు చేశాం. కానీ పట్టించుకోలేదు. తీరా నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చి హడావుడి చేస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీపీఓలపై చర్యలు తీసుకోవాలి.
– జహీర్, స్థానికుడు
ఎస్‌బీఐ కాలనీలోని అక్రమ నిర్మాణాన్ని ఇప్పటికే సీజ్ చేశాం. సెల్లార్‌కు అనుమతి లేదు. చట్టరీత్యా భవన యజమానిపై చర్యలు తీసుకుంటాం. గడ్డి అన్నారంలోని మరో బిల్డింగ్‌ను కూడా సీజ్ చేశాం. అక్రమ నిర్మాణాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. వాటిని కూల్చి వేయడానికి వెనుకాడబోం.
– శ్రీనివాస్, డీసీ, సరూర్‌నగర్ సర్కిల్


