ఓవర్ లోడ్ !
వికారాబాద్: సామర్థ్యం 30 టన్నులు.. వేస్తున్నది 60 టన్నులు.. ఇదీ గూడ్స్ రవాణా పరిస్థితి. ప్యాసింజర్ వాహనాల్లో సైతం సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తున్నారు. ఆర్టీఏ అధికారుల చాలా వరకు ఆఫీసులకే పరిమితమవుతున్నారు. ప్రతిదీ వారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల క్రితం చేవెళ్ల పరిధిలోని హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సు – టిప్పర్ ఢీ కొన్న ఘటనలో ప్రమాద తీవ్రత పెరగటానికి ఓవర్ లోడే కారణమనే వాదన తెరపైకి వచ్చింది. 55 సీట్ల కెపాసిటీ ఉన్న బస్సులో 70 మంది ప్యాసింజర్లు ఉండగా.. 30 టన్నుల సామర్థ్యం ఉన్న టిప్పర్‌లో 60 టన్నుల లోడ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే మృతుల సంఖ్య పెరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రోడ్డు రవాణా నిబంధనల విషయంలో ఆ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీటీఓతోపాటు ఎంవీఐలు సైతం ఆఫీసుల ముంగిటకే వచ్చిపడుతున్న ఆదాయంతో కార్యాలయాలు దాటి బయట కాలు పెట్టడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి వారాంతంలోనో.. నెలాఖరులో టార్గెట్లు రీచ్ కావడం కోసమో ఒకటి అరా తనిఖీలు చేసి మమ అనిపిస్తున్నారు. తనిఖీల సమయంలో టార్గెట్లపైనే దృష్టి పెడుతున్నారే తప్ప వాహనదారులు నిబంధనలు పాటిస్తున్నారా..? వాహనాలకు ఇండికేటర్లు ఉన్నాయా..? ఉంటే అవి వాడుతున్నారా..? రేడియం స్టిక్కర్లు ఉన్నాయా..? మలుపుల్లో సూచిక బోర్డులు ఉన్నాయా..? తదితర విషయాలేవి పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి కూడా ప్రమాదాలకు కారణమవున్నాయి. త్రీ ప్లస్ టూ సామర్థ్యం ఉన్న ఆటోలో 12 నుంచి 15 మంది ప్రయాణికులను, పది మంది కెపాసిటీ ఉన్న తుపాన్ ఇతర వాహనాల్లో 20 మందిని, 55 సీట్ల సామర్థ్యం ఉన్న బస్సులో 70 నుంచి వంద మందిని కుక్కుతున్నారు. వికారాబాద్ నడిబొడ్డున ఆర్టీఓ కార్యాలయానికి కతూవేటు దూరంలోనే నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో లారీలు పార్క్ చేస్తున్నా అటు పోలీసులు, ఇటు ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. పరిగి, తాండూరు, కొడంగల్ ఇతర మండలాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
లారీలు, ట్రక్కుల్లో రెండింతలు..
లారీల్లో ఇతర వాహనాల్లో ఓవర్ లోడ్ అనేది సర్వసాధారణమైపోయింది. ఇసుక, రోబో షాండ్(డస్టు) సిమెంటు, ఎర్రమట్టి, స్టీల్, మట్టి రవాణా కామన్ అయిపోయింది. 12 టన్నుల కెపాసిటీ ఉన్న లారీలో 20 టన్నులు, 17 టన్నుల కెపాసిటీ ఉంటే 30 టన్నులు ఇలా డబుల్ లోడ్ వేసి రవాణా చేస్తున్నారు. నవాబుపేట, పూడూరు, వికారాబాద్, తాండూరు ప్రాంతాల్లో మైనింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతాల నుంచి నిత్యం ఓవర్ లోడ్‌తో లారీలు, ట్రక్కులు నడుపుతున్నారు. దీంతో రోడ్లు ధ్వంసమంతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. ఆర్టీఏ అధికారులు తనిఖీలకు పూర్తిగా స్వస్తి పలకగా పోలీసులు కేవలం ఇసుక లారీలకే పరిమితం చేస్తున్నారు. ఏటా రూ.కోట్లు ఖర్చు చేసి వేస్తున్న రోడ్లు ఏడాది తిరక్కుండానే ఓవర్ లోడ్ వాహనాల కారణంగా పాడవుతున్నాయి. ఈ విషయాన్ని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.
నిబంధనలు గాలికి
సామర్థ్యానికి మించి ముడి సరుకు తరలింపు
30 టన్నులు కెపాసిటీ ఉన్న వాహనంలో 60 టన్నుల రవాణా
ధ్వంసమవుతున్న రోడ్లు
బస్సుల్లోనూ కుక్కేసి..
తరచూ ప్రమాదాలు
గాల్లో కలుస్తున్న ప్రాణాలు
పట్టించుకోని ఆర్టీఏ అధికారులు
చేవెళ్ల బస్సు ప్రమాదానికి ఓవర్ లోడే కారణమనే చర్చ