హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్
హుడాకాంప్లెక్స్: వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీనివాస్ హెచ్చరించారు. విక్టోరియా మెమోరియల్ హోంలో గురువారం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సంక్షేమ అధికారులు, గురుకులాల ఆర్సీఓలు, డీసీఓలు, విద్యాశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, శానిటేషన్, న్యూట్రిషన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్య, బోధన, ఆహారం, వసతి, తరగతి గదుల నిర్వహణ, సాంకేతిక బోధన అందించేందుకు చర్యలు చేపట్టిందని అన్నారు. వసతి గృహాల నిర్వాహకులు బాధ్యతగా పని చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి హెల్త్ ప్రొఫైల్ కార్డును రూపొందించి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. నాణ్యమైన కూరగాయలు, ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలన్నారు. రాత్రి వేళ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, పరిసరాలు, డైనింగ్ హాల్, టాయిలెట్స్, స్టడీ రూమ్స్, కిచెన్ షెడ్, పరిసరాల్లో నిత్యం శానిటేషన్ చేయించాలని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు వారి పరిధిలో ఉన్న అన్ని వసతి గృహాలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్సీ వెల్ఫేర్ అధికారి రామరావు, ఎస్టీ వెల్ఫేర్ అధికారి రామేశ్వరి దేవి, బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాస్


