సమస్యలు పరిష్కరించాకే రండి
కడ్తాల్: గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేపట్టే భూములను పరిశీలించేందుకు గురువారం జిల్లా భూసేకరణ అధికారులతో పాటు రెవెన్యూ, ఎకై ్సజ్, వ్యవసాయ, మిషన్ భగీరథ, ఉద్యానవన శాఖలకు చెందిన అధికారులు ఎక్వాయిపల్లి గ్రామానికి వచ్చారు. ఆయా భూముల్లో సాగు చేసిన పంటలు, పొలాల్లో ఉన్న చెట్లు, వ్యవసాయ బోరు పంపులు తదితరాలను పరిశీలిస్తుండగా సమాచారం అందుకున్న ప్రజా సంఘాల నాయకులతో పాటు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. నష్ట పరిహారంపై ప్రభుత్వం కనీసం రైతులతో చర్చలు జరపకుండా, తమ ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా పరిశీలనకు ఏ విధంగా వస్తారని నిలదీశారు. భూమికి భూమి ఇవ్వాలని, తమ సమస్యలు పరిష్కరించే వరకు, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు రావొద్దని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు, డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తహసీల్దార్ జయశ్రీ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారుల, సీఐ గంగాధర్, ఎస్‌ఐ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భూముల పరిశీలనకు ఎలా వస్తారు?
అధికారులను నిలదీసిన రైతులు


