రోడ్డు విస్తరణకు కృషి చేస్తున్నా
చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ కోసం తాను 2005 నుంచి కృషి చేస్తున్నాని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. చేవెళ్లలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందటం, పలువురు గాయపడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి సహకారం అందిస్తుందని చెప్పారు. జాతీయ రహదారి కోసం 2005 నుంచి అప్పటి ప్రధాన మంత్రి మన్‌మోహన్‌సింగ్‌కు వినతిపత్రం అందించినట్లు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా ఈరోడ్డు కోసం చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. కేంద్రంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. ఎన్‌జీటీలో కేసు వేయటంతో ఇన్నాళ్లు ఆలస్యం జరిగిందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చొరవతో రామ్మోహన్‌రెడ్డి, పర్యావరణ వేత్తలతో కలిసి చర్చలు జరిపి క్లీయర్ చేశామన్నారు. రోడ్డు పనులు ఇక ఆగకుండా త్వరగా పూర్తి చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్‌లు వెంకట్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య


