అభివృద్ధికి సహకరించండి
● భూములు ఇచ్చిన వారికితగిన పరిహారం: ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి
కందుకూరు: అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తుందని, అందుకు రైతులు సహకరించాలని ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. భూము లు ఇచ్చిన వారికి.. భూసేకరణ చట్టం కంటే అదనంగా ఎకరాకు రూ.82 లక్షల చొప్పున పరిహారం అందజేయడంతో పాటు.. 121 గజాల ప్లాటును ఇస్తామని చెప్పారు. ఫ్యూచర్‌సిటీలో భాగంగా టీజీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం మండల పరిధి తిమ్మాపూర్ రెవెన్యూలోని సర్వే నంబర్ 38, 162లలో పారిశ్రామిక పార్కు కోసం భూసేకరణ చేపట్టింది. ఆ సర్వే నంబర్లలోని మొత్తం 562 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆర్డీఓ.. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆ భూములకు చెందిన రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఎకరాకు రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. భూ సేకరణలో మొత్తం భూమి కోల్పోయిన వారికి ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, టీజీఐఐసీ డిప్యూటీ జీఎం ప్రసాద్, నాయబ్ తహసీల్దార్లు శేఖర్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.


