12 కిలోల వెండి మాయం
ఫిర్యాదు చేసిన చైన్నె వ్యాపారులు
శంషాబాద్: కార్గోలో రావల్సిన 12 కేజీల వెండి మాయమైనట్లు చైన్నెకి చెందిన వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. వివరాలివీ... ఈ నెల 20న హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చైన్నెకి 12 కేజీల వెండి కన్‌సైన్‌మెంట్ ఉండగా దానిని స్వీకరించేవారికి అది చేరలేదు. దీంతో సంబంధిత వ్యక్తులు కార్గో రవాణాపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంబంధిత పత్రాల ఆధారంగా వెండి కొనుగోళ్లు.. దాని సరఫరా చేస్తున్న ఎజెన్సీలపై అనుమానం వ్యక్తం చేస్తే దానిని స్వీకరించే వ్యక్తులు శుక్రవారం ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం అందజేయడంతో కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం.
ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత అదృశ్యం
రాజేంద్రనగర్: భర్తతో గొడవపడిన ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించకుండా పోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మామిడి కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం... హైదర్‌గూడ ఎర్రగూడా ప్రాంతానికి చెందిన వెంకటేశ్, అరుణలు దంపతులు. వీరికి మేఘన(6), మేఘనాథ్(7)లు సంతానం. భార్యాభర్తలు ఇరువురు డబ్బు విషయమై గురువారం ఉదయం గొడవపడ్డారు. అనంతరం వెంకటేశ్ ఉదయం ఇద్దరు పిల్లలను స్థానికంగా ఉన్న పాఠశాల వద్ద దింపాడు. అరుణ ఉదయం 11 గంటల ప్రాంతంలో స్కూల్ వద్దకు వెళ్లి ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లిపోయింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వెంకటేశ్ ఫోన్ చేయగా స్వీచాఫ్ వచ్చింది. ఇంటి వద్ద వచ్చి చూడగా ఇంటికి తాళం ఉంది. చుట్టు పక్కల వారిని, బంధు, మిత్రులు, స్థానికంగా వాకబు చేయగా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


