క్రాప్‌లోన్ ఇప్పిస్తానని.. భూమి కాజేశాడు
ఆందోళన వ్యక్తం చేసిన బాధితులు
పూడూరు: పంట రుణం ఇప్పిస్తానని చెప్పిన ఓ వ్యక్తి.. భూమినే కాజేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి కెరవెళ్లి గ్రామానికి చెందిన ఓ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ కరీం.. అదే గ్రామానికి చెందిన దంపతులు అనీస్ పాషా, మౌలానాబేగంలకు చెందిన సర్వే నంబర్ 116లోని ఎకరా 18 గుంటల భూమికి పంట రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆయనను నమ్మిన బాధితులు.. అతనితో పాటు ఈ నెల 25న పూడూరు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు. వారికి తెలియకుండా కరీం.. స్లాట్ బుక్ చేసి, భూమిని తన పేరిట మార్చుకున్నాడు. విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితులు.. గ్రామస్తులకు వివరించారు. అనంతరం వారందరూ.. కరీంను నిలదీశారు. రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, బాధిత రైతు పేరిట మార్చాలని కోరుతూ.. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. చన్గోముల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యప్తు చేస్తున్నామని ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపారు.
భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి
● శిథిల నివాసాల్లో ఉండరాదు
● వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి
● పోలీసు అధికారులకు దిశానిర్దేశం
అనంతగిరి: కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం ఆయన మాట్లాడారు. తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధి వాగులు, కుంటలు, చెరువుల నీటి ప్రవాహంపై నిరంతరం దృష్టి పెట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా.. రాకపోకలకు ఆటంకం కలిగించేలా పొంగిపొర్లుతున్న వాగులు, నాలాల ప్రాంతాల్లో రహదారులను మూసివేయాలని పేర్కొన్నారు. నీటి ప్రవాహం వద్దకు ప్ర జలు ఎవరూ వెళ్లకుండా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. శిథిలావస్థ ఇళ్లల్లో నివాసం ఉండొద్దని, తక్షణమే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని కోరారు. ఎవరికై నా ఏదైనా అత్యవసరం ఉండి, పోలీస్ సహాయం అవసరమైతే, వెంటనే ఆయా ఠాణా అధికారులకు కానీ.. డయల్ 100 లేదా లేదా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712670056కు ఫోన్ చేయాలని వివరించారు. ప్రజలందరూ సహకరించి, సురక్షితంగా ఉండాలని ఎస్పీ కోరారు.
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
తాండూరు రూరల్: రైలుకింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం రుక్మాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రుక్మాపూర్ గ్రామానికి చెందిన కొత్తింటి అనంతయ్య, భారతమ్మ దంపతుల కుమారుడు లక్ష్మణ్(28), తాండూరు పట్టణంలోని ఓ కంపెనీలో డెలివరి బాయ్‌గా పనిచేస్తూనే.. ఊర్లో వ్యవసాయం చేసేవాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తాండూరు– రుక్మాపూర్ రైల్వే పట్టాలపై బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రేమ విఫలంకారణంగానే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
క్రాప్‌లోన్ ఇప్పిస్తానని.. భూమి కాజేశాడు


