చెరువులు చెర!
మంచాల: గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. వీటిని కాపాడాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన కొంతమంది నాయకులు సైతం అక్రమార్కులకే వంతపాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మంచాల మండలంలో మొత్తం 126 చెరువులు, కుంటలు, 38 చెక్‌డ్యాంలు ఉన్నాయి. వీటిలో వంద ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న నాలుగు చెరువులున్నాయి.
అగమ్యగోచరంగా..
పలు గ్రామాల్లోని చెరువుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలా వరకు చెరువులు ఊళ్లకు సమీపంలో, ప్రధాన రహదారులకు దగ్గరగా ఉన్నాయి. వీటి సమీపంలోని పట్టా భూములు, ఎఫ్‌టీఎల్ పరిధిలోని భూములను కొనుగోలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆతర్వాత చెరువు భూములను చెరబడుతున్నారు. బఫర్ జోన్లలో మట్టి నింపి విక్రయిస్తున్నారు.
మచ్చుకుకొన్ని..
అల్లిచెరువు:ఆగాపల్లి– కాగజ్‌ఘట్ గ్రామాల మధ్య అల్లిచెరువు ఉంది. దీనికి 40 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది, ఇది నిండితే 25 నుంచి 30 ఎకరాలు వరకు ఎఫ్‌టీఎల్ పరిధిలో నీళ్లు ఉంటాయి. దీని చుట్టూ భూమి కొనుగోలు చేసిన కొంతమంది వ్యాపారులు ఎఫ్‌టీఎల్‌ను మాయం చేశారు. పట్టా భూమి పేరుతో హద్దు రాళ్లు తొలగించి, మట్టిపోసి ప్లాట్లుగా మార్చారు. బఫర్ జోన్‌లో ఏకంగా నిర్మాణాలే చేపట్టారు. ఈ విషయమై ఫిర్యాదులు వెళ్లడంతో సర్వే చేసిన అధికారులు ఆక్రమణ వాస్తవమేనని తేల్చారు. వ్యాపారిపై కేసు నమోదు చేసినా, స్థలం మాత్రం కబ్జాచెరలో ఉంది.
ఉషమ్మ చెరువు
ఆగాపల్లి, కాగజ్‌ఘట్ నోముల గ్రామాల సరిహద్దు మధ్య ఉంటుంది. దీని ఆయకట్టు 40.01 ఎకరాలు, కెపాసీటి ఆరున్నర ఎకరాలకు పైగా ఉంటుంది. చెరువు నిండితే ఎఫ్‌టీఎల్ పరిధిలోని యాభై ఎకరాల మేర నీళ్లు వస్తాయి. దీని చుట్టూ భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు చెరువులోకి నీళ్లు వచ్చే కాల్వను మాయం చేశారు. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ హద్దులు చెరిపేశారు.
ఎల్సోనికుంట
ఆరుట్లలోని ఈ చెరువు 69 ఎకరాల ఆయకట్టు ఉంది. నీటినిల్వ సామర్థ్యం 9ఎకరాలు. పైన ఉన్న గొలుసు కట్టు చెరువుల ద్వారా ఇందులోకి వరద వచ్చేది. కాల్వలు కబ్జాకు గురికావడంతో నీటి ఆధారం లేకుండా పోయింది. ఆరుట్లలోని పడమటి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా రియల్ వ్యాపారులు కొనుగోలు చేశారు.
రామసముద్రం
చెన్నారెడ్డిగూడలో సుమారు నాలుగు ఎకరాల మేర విస్తరించి ఉన్న ఈ చెరువు ప్రస్తుతం దాదాపు కనుమరుగైంది. చుట్టు పక్కల భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు మట్టినింపి చెరువును కబ్జా చేశారు. దీంతో వీరికి 4 ఎకరాల భూమి అదనంగా కలిసి వచ్చింది. ఇలా మంచాల మండలంలో చాలా చెరువులు కబ్జాకు గురవుతున్నాయి.
మాయమవుతున్న ఎఫ్‌టీఎల్, వరద నీటి కాల్వలు
పట్టించుకోని అధికారులు, పాలకులు


