మాడ్గుల: మండలంలోని వాగుల నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఐ వేణుగోపాల్‌రావు హెచ్చరించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న అందుగుల, ఇర్విన్ గ్రామాలకు చెందిన 24 మంది నిందితులను గుర్తించి మంగళవారం తహసీల్దార్ వినయ్‌సాగర్ ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని, ప్రజలు చట్టాన్ని గౌరవించి అక్రమాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాఘవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
పని ఒత్తిడితో సంతకం చేయలేదు
షాబాద్: తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్టార్‌లో పని ఒత్తిడితోనే సంతకాలు పెట్టలేదని తహసీల్దార్ అన్వర్ తెలిపారు. కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న చేవెళ్లే ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డిలు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారన్నారు. ఆ సమయంలో పరిపాలన విభాగం ఆదేశాలనుసారం హైకోర్టుకు వెళ్లినట్లు చెప్పారు. పని ఒత్తిడి వల్లే రిజిస్టార్‌లో సంతకం చేయలేదన్నారు. 15 రోజులుగా అత్యవసరంగా 22ఏ తయారు చేసే క్రమంలో మొత్తం రెవెన్యూ సిబ్బంది పని చేస్తుందన్నారు.
బస్సు డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు
ఇబ్రహీంపట్నం: కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో సోమవారం ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకట నర్సప్ప తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువు కట్టపై బైక్‌ను ఓవర్ టెక్ చేసే క్రమంలో కారు డ్రైవర్ ఎడమ వైపు నుంచి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కుడి వైపు ఉన్న బస్సు ముందుకు ఆకస్మాత్తుగా రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. బస్సు ముందు కారు బోల్తా పడితే.. దానిపైకి వెళ్లకుండా తమ డ్రైవర్ రాజశేఖర్‌రెడ్డి చాకచక్యంతో పక్కకు తప్పించారన్నారు. బస్సులో 30 మంది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించాడన్నారు.
ఉగాండా జాతీయురాలి డిపోర్టేషన్
శంషాబాద్: కాలపరిమితి ముగిసినా నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న ఓ ఉగాండా జాతీయురాలుతో పాటు ఆమె కుమార్తెను తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి ఆమె స్వదేశానికి తిరిగి పంపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఉగాండాకు చెందిన ఎంజెలా నైరుస్థి (36)తో పాటు ఆమె కుమార్తె బ్లెసింగ్ కాలపరిమితి ముగిసినా నగరంలోనే ఉంటున్నారు. అంతేకాకుండా ఎంజెలా నైరుస్థికి ఆగస్టు 15 మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎకై ్సజ్ కేసులో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్ అరేబియాకు చెందిన జీ9468 విమానంలో షార్జాకు అక్కడి నుంచి కనెక్టివిటీ విమానం జీ9–691లో షార్జా నుంచి ఎంటీబీకి వెళ్లేళలా ఏర్పాట్లు చేసి ఎయిర్‌పోర్టు డిపార్చుర్‌లో వారిని వదిలేశారు. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు భద్రతాధికారులు వారిని ఫ్లైట్ ఎక్కించినట్లు సమాచారం.
ఎయిర్ హోస్టెస్ బలవన్మరణం
రాజేంద్రనగర్: ఓ ఎయిర్ హోస్టెస్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన జాహ్నవి గుప్తా (28) ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తూ రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి కెన్‌ఫుడ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. శనివారం సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిన ఆమె రాత్రి తన గదిలో ఉరి వేసుకుపి ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఉదయం ఆమె సెల్‌ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన అపార్ట్‌మెంట్ వాసులు జమ్ముకాశ్మీర్‌లో ఉంటున్న ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపార్ట్‌మెంట్‌వాసుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా జాహ్నవి గుప్తా ఉరికి వేలాడుతూ కనిపించింది. పంచనామా నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం సాయంత్రం జమ్మూకాశ్మీర్ నుండి వచ్చిన తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. కాగా ఈ ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.


