అప్పుడే అడ్మిషన్ల వేట!
విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రచారం పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు స్కాలర్‌షిప్ టెస్టుల పేరుతో వల అడ్డదారులు తొక్కుతున్న ఇంటర్ కాలేజీలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వార్షిక పరీక్షలు ఇంకా మొదలే కాలేదు. పలు ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీలు అప్పుడే అడ్మిషన్ల వేట మొదలు పెట్టాయి. స్కాలర్‌షిప్ టెస్టుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులకు వల విసురుతున్నాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పిల్లలతో కలిసి తమ క్యాంపస్‌ను సందర్శించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాయి. తీరా వచ్చి స్కాలర్‌షిప్ టెస్టు రా సిన తర్వాత అడ్మిషన్ల ప్రస్తావన తెరపైకి తెస్తు న్నాయి. వార్షిక పరీక్షలు ముగిసి, ఫలితాలు వెల్లడించిన తర్వాత నిర్దేశిత మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్న వాళ్లకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. ఆఫర్ చేస్తున్న కోర్సులు, మౌలిక సదుపాయాలను బట్టి వసూలు చేస్తున్నాయి. డే స్కాలర్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు, రెసిడెన్షియల్‌కు రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు చెబుతున్నాయి. పోటీతో కోరుకున్న క్యాంపస్‌లో ఎక్కడ సీటు దక్కకుండా పోతుందోననే భయంతో మెజార్టీ తల్లిదండ్రులు తమకు ఇష్టం లేకపోయినా రూ.10 వేలు చెల్లించి సీటును ఖరారు చేసుకుంటున్నారు.
ఏజెంట్ల నియామకాలు.. కమీషన్లు
జిల్లాలో 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, రెండు ఎయిడెడ్ కాలేజీలు ఉండగా, మరో 221 ప్రైవేటు, రెసిడెన్షియల్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. మెజార్టీ రెసిడెన్షియల్ కాలేజీలు తట్టిఅన్నారం, కొత్తపేట్, ఎల్బీనగర్, హయత్‌నగర్, మన్సూరాబాద్, వనస్థలిపురం, కోహెడ, ఆదిబట్ల, కొంగరకుర్దు, రావిర్యాల, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోనే ఉన్నాయి. ఆయా కాలేజీలన్నీ ఇరుకై న అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధనకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో పని చేస్తున్న ఫ్యాకల్టీని మార్కెటింగ్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి సేకరించి, ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో గత విద్యార్థులు సాధించిన ర్యాంకులను సాకుగా చూపిస్తున్నాయి. ఫీజులో రాయితీ పేరుతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మభ్యపెడుతూ ముందస్తు అడ్మిషన్లకు తెరతీశాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయా కాలేజీల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థిపై సదరు ఏజెంట్‌కు రూ.25వేల వరకు కమీషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు తెలిసీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చర్యలు తీసుకుంటాం
జిల్లాలోని పలు ప్రైవేటు జూనియర్ కాలేజీలు అకడమిక్ ఇయర్‌కు ముందే అడ్మిషన్లు చేపడుతున్న విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే యాజమన్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం. వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత అనుమతి పొందిన కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలి. తల్లిదండ్రులు మార్కెట్ ఏజెంట్ల వలలో చిక్కుకోవద్దు.
– వెంక్యానాయక్, ఇంటర్‌బోర్డు జిల్లా అధికారి
అప్పుడే అడ్మిషన్ల వేట!


