ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి

Oct 29 2025 9:31 AM | Updated on Oct 29 2025 9:31 AM

ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి

ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి

● కలెక్టర్‌ నారాయణరెడ్డి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్‌బెడ్రూంల పంపిణీ ప్రక్రియ, వన మహోత్సవం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, హౌసింగ్‌ ఏఈలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎపీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మండలాల వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు.. ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి.. గ్రౌండింగ్‌ అయినవి ఎన్ని అని అడిగి తెలుసుకున్నారు. మంజూరు అయిన వారంతా తక్షణమే నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రోత్సహిస్తూ క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఇందుకు ఇందిరమ్మ కమిటీల సహకరం తీసుకోవాలని సూచించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగిరం చేయాలని చెప్పారు. ప్రతి గ్రామ, మున్సిపాలిటీ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రగతి పార్కుల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు 100 శాతం మొక్కలు నాటాలని ఆదేశించారు. బృందాలను ఏర్పాటు చేసి నవంబర్‌ 1 నుంచి నాటిన మొక్కలను పరిశీలించడం జరుగుతుందన్నారు. పాఠశాలలు, గురుకులాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, ప్రతి రోజు పారిశుద్ధ్యం చేపట్టాలని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, డీపీఓ సురేష్‌ మోహన్‌, సివిల్‌ సప్లై అధికారి వనజాత, విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, ఉద్యాన శాఖ అధికారి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా సేవలందించాలి

ప్రతి ఉద్యోగి నిజాయతీగా, పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం రీజినల్‌ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌ సందర్భంగా సిబ్బందితో సమగ్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా విజిలెన్స్‌ వారోత్సవం చేపట్టినట్టు చెప్పారు. ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు అవినీతి లేకుండా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సుపరిపాలన అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, సివిల్‌ సప్లయ్‌ అధికారులు వనజాత, హరీష్‌, పంచాయతీ అధికారి సురేష్‌ మోహన్‌, ఆడిట్‌ అధికారి వెంకట్‌రెడ్డి, విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

యాచారం: మండలంలోని మొండిగౌరెల్లి అసైన్డ్‌ రైతులు మంగళవారం ఆర్డీఓ అనంత్‌రెడ్డితో వెళ్లి కలెక్టరేట్‌లో కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిశారు. ఎకరాకు రూ.70 లక్షల పరిహారంతో పాటు 121 గజాల చొప్పున ప్లాటు ఇచ్చే విధంగా చూడాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మార్కెట్‌ విలువ ప్రకారం మూడు రెట్లు ఇవ్వాల్సి వస్తే ఎకరాకు రూ.18 లక్షలే పరిహారం వస్తుందని అన్నారు. రైతుల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని తనకున్న అధికారాన్ని ఉపయోగించి ఎకరాకు రూ.22 లక్షల పరిహారంతో పాటు 121 గజాల చొప్పున ప్లాటు ఇస్తామని తెలిపారు. అసైన్డ్‌ సర్వే నంబర్లు 19, 68, 127లలో నకిలీ సర్టిఫికెట్లను తీసేయాలని రైతులు కోరగా నకిలీ పేర్లను రికార్డుల్లోంచి తొలగిస్తామని, పరిహారం పెంపు విషయంలో సర్కార్‌ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

పరిహారంలో న్యాయం చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement