ఆయిల్‌పాం సాగు లాభదాయకం
ఇబ్రహీంపట్నం రూరల్: ఆయిల్‌పాం సాగు ఎంతో లాభదాయకమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్ అన్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉప్పరిగూడ రైతు వేదికలో మంగళవారం సహకార సంఘాల సెక్రెట్రీలు, చైర్మన్లు, డైరెక్టర్లకు ఆయిల్‌పాం సాగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం 12 ఎకరాల వరకు మొక్కలు అందిస్తుందని, సబ్సిడీపై డ్రిప్పు, నాలుగేళ్లపాటు ఎకరానికి రూ.4,200 చొప్పున మెయింటనెన్స్ ఇస్తుందన్నారు. పండిన పంటను తిరిగి కొనుగోలు చేస్తుందని చెప్పారు. సంవత్సరానికి ఎకరాకు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీసీఓ సుధాకర్, ఇన్‌చార్జి డీఏఓ శోభ, వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత, ఎంపీడీఓ వెంకటమ్మ, ఏపీఓ తిరుపతచారి, ఉప్పరిగూడ పీఏసీఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


